హైదరాబాద్: సికింద్రాబాద్ నగర పరిధిలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్వప్నలోక్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న వరుస చిన్న, చిన్న షాపుల్లోని ఓ రేడియం షాప్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. మూసి ఉన్న షట్టర్ తాళం పగలగొట్టి ఎగిసిపడుతున్న మంటలపై నీళ్లు చల్లి.. మంటలను అదుపు చేశారు స్థానికులు. అప్పటికే ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. స్థానికులు.. పైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలు అదుపుచేయడం వల్ల పెను ప్రమాదం తప్పి ప్రక్కన ఉన్న షాపులకు వ్యాపించలేదు. షాట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. ఢిల్లీలోని మాయాపురి ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో నిన్న తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. మంటలను ఆర్పే క్రమంలో ఇద్దరు పోలీసులు, ఏడుగురు వ్యక్తులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. గాంధీనగర్ మార్కెట్‌లోని రెండంతస్తుల సోఫా ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. సోఫా స్ప్రింగ్స్ ప్యాకింగ్ బాక్స్‌లో మంటలు చెలరేగాయని, గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంచిన జిగురు డ్రమ్ పగలడంతో మంటలు ఎక్కువగా వ్యాపించాయని అధికారులు వివరించారు. గాయపడిన వారిని డీడీయూ ఆసుపత్రికి తరలించారు. అగ్నిప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు పోలీసులను రంగంలోకి దించారు. మాయాపురి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.