తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా దీపావళి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. చీకట్లు తొలగిపోవాలని, జీవితంలో వెలుగులు నింపాలని దీపావళిని ఘనంగా జరుపుకున్నారు. చిన్నా,పెద్దా అంతా టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. అయితే.. కొన్ని చోట్ల పటాకులు కాలుస్తూ పలువురు గాయపడ్డారు. చికిత్స కోసం మెహదీపట్నంలోని సరోజని దేవి కంటి ఆస్పత్రికి క్యూ కట్టారు. వీరిలో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు.
ఇప్పటి వరకు 30 మంది బాధితులు గాయాలతో ఆస్పత్రికి వచ్చినట్లు వైద్యురాలు వసంత తెలిపారు. 12 మంది బాధితులను ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకుని చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. బాధితుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. వారిలో ముగ్గురని ఇతర ఆస్పత్రులకు రిఫర్ చేశామన్నారు. ఇక గాయపడిన వారిలో అత్యధికులు చిన్నారులే ఉన్నారన్నారు.
మరోవైపు.. ఉస్మానియా, గాంధీ హాస్పిటల్ లో కూడా 20 మంది బాధితులకు చికిత్స అందించారు.