తెలంగాణ సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతి వద్ద శనివారం తీవ్ర కలకలం రేగింది. ఓ కుటుంబం ప్రగతి భవన్ ఎదుట ఆత్మహత్యకు యత్నించింది. ముగ్గురు పిల్లలతో కలిసి వచ్చిన దంపతులు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది వెంటనే అప్రమత్తమై వారిని అడ్డుకున్నారు. ఆత్మహత్యకు యత్నించిన వారిని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన వారిగా గుర్తించారు. తమ ఐదెకరాల భూమిని కొంతమంది వ్యక్తులు కబ్జా చేశారని, తమకు న్యాయం చేయాలని ఆ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా.. గతంలోనూ ప్రగతి భవన్ ఎదుట ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో లక్ష్మణ్ అనే ఓ వ్యక్తి ప్రగతి భవన్ వద్ద ఆత్మహత్యకు యత్నించాడు. ఒంటిపై డీజిల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేయగా పోలీసులు అతన్ని అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. ఇదే ఏడాది జూన్‌లో ఇద్దరు అన్నాదమ్ములు సైతం ఆత్మహత్యాయత్నం చేశారు. కాగా.. ప్రగతి భవన్ ఎదుట ఇలాంటి ఘటనలు తరచుగా చోటు చేసుకుంటుండటం చర్చనీయాంశంగా మారింది.