హైదరాబాద్ తార్నాకలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతుల్లో నాలుగేళ్ల బాలిక కూడా ఉంది. నలుగురు తమ నివాసంలో శవాలై కనిపించారు. మృతులను ప్రతాప్ (34), అతని భార్య సింధూర (32), వారి కుమార్తె ఆద్య (4), ప్రతాప్ తల్లి రాజతిగా గుర్తించారు. వీరు చెన్నైకి చెందినవారు.
ప్రతాప్ ఉరివేసుకుని చనిపోగా.. మిగతా వారు అనుమానాస్పద స్థితిలో కనిపించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆదివారం నుంచి తలుపులు తెరవకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ప్రతాప్ చెన్నైలోని బీఎండబ్ల్యూ కార్ షోరూమ్‌కు డిజైనర్ మేనేజర్‌గా, సింధూర హిమాయత్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నారు. చెన్నైకి మకాం మార్చే విషయంలో కుటుంబ కలహాలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.
మృతికి గల కారణాలను గుర్తించేందుకు అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఉస్మానియా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎల్.రమేష్ నాయక్ మాట్లాడుతూ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని, తదుపరి విచారణ తర్వాత వారి మృతికి గల ఖచ్చితమైన కారణం తెలుస్తుందని చెప్పారు.