నిజమైన పోలీసులు కూడా గుర్తుపట్టలేదు..నకిలీ ఖాకీ దుస్తులతో మహిళ విధులు
హైదరాబాద్ నగరంలో నకిలీ పోలీస్ కానిస్టేబుల్ కలకలం రేపింది.
By - Knakam Karthik |
నిజమైన పోలీసులు కూడా గుర్తుపట్టలేదు..నకిలీ ఖాకీ దుస్తులతో మహిళ విధులు
హైదరాబాద్ నగరంలో నకిలీ పోలీస్ కానిస్టేబుల్ కలకలం రేపింది. కానిస్టేబుల్‌గా నిజమైన నియామకం లేకపోయినా, పోలీసు యూనిఫామ్ వేసుకొని పలు విఐపీల కార్యక్రమాల్లో బందోబస్తు బాధ్యతల్లో పాల్గొన్న ఉమాభారతిని జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె చేసిన ధైర్యసాహసాలు, పోలీసులను కూడా ఆశ్చర్యానికి గురిచేసేంతగా ఉన్నాయి. ఉమాభారతి కానిస్టేబుల్ అర్హత పరీక్షలకు సిద్ధమవుతుండగా సెలెక్ట్ కాకపోవడంతో, తానే స్వయంగా ఖాకీ డ్రెస్సు కొనుగోలు చేసి అసలు సిబ్బంది మధ్య కలిసిపోతూ డ్యూటీలు నిర్వహించిందని పోలీసులు గుర్తించారు. సచివాలయంలో జరిగిన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన ఊరేగింపు బందోబస్తు, అలాగే పలు విఐపీల సందర్శనల సమయంలో కూడా ఆమెను డ్యూటీ చేస్తూ పోలీసులే పలుమార్లు చూశారు.
అంతేకాకుండా, ఆమె సైబరాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు వెళ్లి, అక్కడి క్యాంటీన్‌లో సిబ్బందిలా గడిపి తిరిగి వెళ్లిపోయిన ఘటన కూడా విచారణలో వెల్లడైంది. కొన్ని విద్యాసంస్థల్లో సైబర్ క్రైమ్ అవేర్‌నెస్ పేరుతో లెక్చర్లు కూడా ఇచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ఒక బందోబస్తు సమయంలో ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన నేపథ్యంలో అధికారులు ప్రశ్నించగా, ఉమాభారతి నిజమైన పోలీసు కాదన్న విషయం బట్టబయలైంది. దర్యాప్తులో ఆమెకు ఎటువంటి పోలీసు ఐడీ, అధికారిక రికార్డులు లేవని స్పష్టమైన తరువాత ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై జీడిమెట్ల పోలీసులు నకిలీ పోలీసు వేషధారణ, ప్రభుత్వ ఉద్యోగిని తప్పుగా నటించడం వంటి సెక్షన్లతో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. నగరంలో భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు రేపుతున్న ఈ సంఘటన ప్రస్తుతం పోలీసు రంగంలో హాట్‌టాపిక్‌గా మారింది.