స‌మోసా రూ.10, ఇడ్లీ రూ.20, చికెన్ బిర్యానీ రూ.150

Election cost of candidates.. గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పోరేష‌న్‌(జీహెచ్ఎంసీ) ఎన్నిక‌ల న‌గారా మోగడంతో..

By సుభాష్  Published on  20 Nov 2020 1:23 PM IST
స‌మోసా రూ.10, ఇడ్లీ రూ.20, చికెన్ బిర్యానీ రూ.150

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పోరేష‌న్‌(జీహెచ్ఎంసీ) ఎన్నిక‌ల న‌గారా మోగడంతో.. హైద‌రాబాద్‌లో ఎన్నిక‌ల వేడి మొద‌లైంది. నామినేష‌న్ల‌కు నేడు ఆఖ‌రి రోజు కావ‌డంతో.. ఇప్ప‌టికే దాదాపు ప్ర‌ధాన పార్టీలు అన్ని త‌మ అభ్యర్థుల వివ‌రాల‌ను వెల్ల‌డించాయి. ఆయా ఆయా పార్టీల త‌రుపున బ‌రిలోకి దిగే అభ్య‌ర్థులు ఇప్ప‌టికే నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. ఎన్నిక‌ల‌కు ఎంతో సమ‌యం లేక‌పోవ‌డంతో.. త‌మ ప్ర‌చారాన్ని సైతం మొద‌లుపెట్టే ప‌నిలో ఉన్నారు. ఎన్నిక‌ల బరిలో న‌లిచే అభ్య‌ర్థుల వ్య‌య ప‌రిమితి రూ.5ల‌క్ష‌లుగా నిర్ణ‌యించారు. ప్ర‌చార స‌మ‌యంలో అంతకు మించి ఖ‌ర్చు చేసిన‌ట్లు తేలితే.. ఆ అభ్య‌ర్థిపై అన‌ర్హ‌త వేటు వేసే అధికారం ఎన్నిక‌ల సంఘానికి ఉంటుంది. దీంతో ప్ర‌చార స‌మ‌యంలో ఎంత ఖ‌ర్చు పెడుతున్నార‌నేది కీల‌కం కానుంది.

తాగే నీటి నుంచి రోడ్ షోల్లో వినియోగించే సౌండ్ బాక్స్‌ల వ‌ర‌కు ప్ర‌తి దానికి ఓ రేటును నిర్ణ‌యించారు. దీని ఆధారంగానే అభ్య‌ర్థుల ఖ‌ర్చును లెక్కిస్తారు. అభ్యర్థులు ఇష్టానుసారం ఖర్చు చేసి ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా ఉండాలన్న ఉద్దేశంతో చేసే ప్రతి ఖర్చుకు ఓ ధరను నిర్ణయించారు.

అధికారులు విడుదల చేసిన ధరల జాబితా ప్రకారం.. అభ్యర్థి వేసుకునే కండువాకు రూ. 20, మాస్కుకు రూ. 20 చొప్పున లెక్క కడతారు. ప్రచారంలో భాగంగా అల్పాహారం తీసుకుంటే నాలుగు ఇడ్లీలకు రూ. 20, నాలుగు వడలకు రూ. 20, ఆలూ సమోసా తింటే రూ. 10, ఇరానీ సమోసాకు రూ. 3 చొప్పున లెక్కిస్తారు. ఇక చికెన్ బిర్యానీకి రూ.150, మ‌ట‌న్ బిర్యానీకి రూ.160గా లెక్క‌గ‌డుతారు. ప్రచారంలో ఉపయోగించే టాటా ఇండికా కారుకు రోజుకు డ్రైవరు బత్తాతో కలిపి రూ. 1200, 16 మంది వరకు కూర్చునే మాక్సీ క్యాబ్‌కు రూ. 1700, ఆటోకు రూ. 300, మినీ లారీకి రూ. 1700, బస్సుకు రూ. 3,900, ట్రాక్టరుకు రూ. 1400, మామూలు కుర్చీకి ఏడు రూపాయలు, టీ, కాఫీలకు రూ. 5 నుంచి రూ. 10, వాటర్ ప్యాకెట్‌కు రూపాయి, వాటర్ బాటిల్‌కు రూ. 20, 400 వాట్స్ లౌడ్ స్పీకర్లు రెండింటికి రూ. 3,850, ఐదుగురు కూర్చునే వేదిక నిర్మాణానికి రూ. 2,200, వస్త్రంతో చేసిన చిన్న జెండాకు రూ. 30, పెద్దదైతే రూ. 61గా ధరలను నిర్ణయించారు. ఇవన్నీ ఉపయోగించినా ఎన్నికల్లో అభ్యర్థి ఖర్చు రూ. 5 లక్షలకు మించకూడదు.

Next Story