సంక్రాంతి సందర్భంగా చైనా మంజా వల్ల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. నిన్న హైదరాబాద్ మీర్‌పేటలో ఓ వృద్ధురాలి (85) కాలిని మంజా కోసేసింది. అల్మాస్‌గూడ ప్రధాన రహదారిపై రోడ్డుప్రక్కన నడుచుకుంటూ వెళ్తున్న యాదమ్మ అనే వృద్ధ మహిళకు అకస్మాత్తుగా చైనా మాంజా కాలికి చుట్టుకుంది. ఈ ఘటనలో ఆమె కాలు తీవ్రంగా కోసుకుపోయి భారీగా రక్తస్రావం జరిగింది. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వృద్ధురాలిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతోంది.
ఇదిలా ఉంటే.. నల్లకుంట పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ నాగరాజు చైనా మాంజాతో గాయపడ్డారు. ఎగ్జిబిషన్ డ్యూటీ కోసం ఉప్పల్‌లోని తన ఇంటి నుంచి బయలుదేరిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఉప్పల్ PS పరిధిలోని సౌత్ స్వరూప్ నగర్ వద్ద మాంజా ఆయన మెడకు చుట్టుకుని గొంతుకు తీవ్ర గాయామైంది. వెంటనే ఆయనను ఎల్బీనగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
చైనా మంజా వల్ల జరుగుతున్న వరుస ప్రమాదాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. వాహనాలపై వెళ్లేవారు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. శరీరమంతా కవర్ అయ్యేలా దుస్తులు ధరించాలి. మెడకు కర్చిఫ్ కట్టుకోవాలి. కాళ్లకు సాక్సులు, షూ, చేతులకు గ్లౌవ్స్ వేసుకోవడం వల్ల మాంజాల నుంచి రక్షణ పొందవచ్చు.