హైదరాబాద్: సృష్టి సరోగసీ కేంద్రం అక్రమాల కేసులో అరెస్ట్ అయిన డాక్టర్ నమ్రత చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సరోగసీ ముసుగులో భారీ ఎత్తున మనీలాండరింగ్ మరియు హవాలా లావాదేవీలు జరిగినట్లు గుర్తించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), ఆమెను విచారించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో డాక్టర్ నమ్రతను ఐదు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఈడీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
సరోగసీ సేవల పేరుతో విదేశాల నుండి అక్రమ మార్గాల్లో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు ఈడీ అధికారులు ప్రాథమిక విచారణలో తేల్చారు. అక్రమ కార్యకలాపాల ద్వారా సంపాదించిన సొమ్మును మనీలాండరింగ్ రూపంలో మళ్లించినట్లు ఆధారాలు సేకరించారు. ఈ అక్రమ నెట్‌వర్క్ వెనుక ఉన్న మరికొంత మంది కీలక వ్యక్తుల వివరాలను, నిధుల మళ్లింపు గుట్టును రాబట్టేందుకు డాక్టర్ నమ్రతను లోతుగా విచారించాల్సి ఉందని ఈడీ కోర్టుకు విన్నవించింది. ఈడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై ప్రత్యేక కోర్టు రేపు విచారణ జరపనుంది. కోర్టు కస్టడీకి అనుమతిస్తే, ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అరెస్ట్ అయిన నమ్రత, ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు.