జవహనర్‌నగర్ డంప్‌యార్డ్ నుంచి తీవ్ర దుర్వాసన.. గాలి పీల్చుకోలేకపోతున్న స్థానికులు
Due to bad smell coming from Jawaharnagar dump yard, the locals are facing serious problems. హైదరాబాద్‌లో నగర శివారులోని జవహర్‌నగర్ డంప్‌యార్డులో మళ్లీ దుర్వాసన వెదజల్లుతోంది. దీని కారణంగా మూడు రోజులుగా
By అంజి
హైదరాబాద్‌లో నగర శివారులోని జవహర్‌నగర్ డంప్‌యార్డులో మళ్లీ దుర్వాసన వెదజల్లుతోంది. దీని కారణంగా మూడు రోజులుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో డంప్‌యార్డు వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. డంప్‌యార్డు కారణంగా ఇప్పటికే గాలి, నేల, భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం తమ విజ్ఞప్తులను నిర్లక్ష్యం చేస్తోందని స్థానికులు అంటున్నారు. రోజురోజుకూ పరిస్థితి అధ్వాన్నంగా మారుతోందని ఆందోళణ వ్యక్తం చేస్తున్నారు.
దీని కారణంగా అంటూ వ్యాధులు ప్రబలుతున్నాయి. డంప్‌యార్డు చుట్టూ డ్రోన్‌తో పిచికారీ చేయాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు సూచించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. జవహర్‌నగర్‌కు చెందిన శాంతిరెడ్డి మాట్లాడుతూ.. ''గత కొన్నేళ్లుగా డంప్‌యార్డు కారణంగా ఇబ్బందులు పడుతున్నాం. మెల్లగా పరిస్థితి సాధారణ స్థితికి వచ్చినా గత మూడు రోజులుగా డంప్ యార్డు నుంచి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. ఊపిరి పీల్చుకోలేకపోతున్నాం. మేము జవహర్‌నగర్ మున్సిపాలిటీకి, రామ్‌కీ ఎన్విరో ఇంజనీర్స్ లిమిటెడ్ (REEL) అధికారులకు కూడా చాలా ఫిర్యాదులు చేసాము. కానీ మేం చెప్పిన మాటలు అన్నీ చెవిటి చెవిలో పడ్డట్టున్నాయి. అలాగే శాశ్వత పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన పవర్ ప్లాంట్ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. డంప్‌యార్డు మారిస్తే బాగుంటుంది.'' అని అన్నారు.
జవహర్‌నగర్‌కు చెందిన మరో నివాసి వెంకట్ మాట్లాడుతూ.. "మరోసారి డంప్‌యార్డు నుండి ఘాటైన దుర్వాసన వస్తోంది. సుమారు 50,000 మంది ఇక్కడ నివసిస్తున్నారు. ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా ఉంది. మేము తెల్లవారుజామున, అర్థరాత్రి చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాము. ఇంతకు ముందు వారంలో ఒకటి రెండు సార్లు దుర్వాసన వచ్చేది కానీ గత మూడు రోజులుగా ప్రతిరోజూ ఈ వాసనను భరిస్తున్నాం. ఈ దుర్వాసన కారణంగా మేం బలవంతంగా తలుపులు, కిటికీలు మూసేయాల్సి వస్తోంది" అని చెప్పారు.
పలు సార్లు కాలుష్యంపై కంట్రోల్ బోర్డ్‌కు ఫిర్యాదులు చేశాం. సమస్యను ధృవీకరించడానికి సంబంధిత అధికారి మా ప్రాంతాన్ని సందర్శించారు. కానీ ఎటువంటి చర్య తీసుకోలేదు. సంబంధిత అధికారులకు సోషల్ మీడియాలో ఫిర్యాదులు చేయడం, ట్యాగ్ చేయడంతో విసిగిపోయాం.. అనేక నిరసనలు చేశాం.. కానీ అవన్నీ ఫలించలేదు.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీనికి శాశ్వత పరిష్కారం దొరకలేదు. కనీసం ఇప్పుడైనా సంబంధిత అధికారులు నివాసితులకు ఉపశమనం కలిగించడానికి సమస్యకు శాశ్వత పరిష్కారంతో ముందుకు రావాలి." అని అన్నారు.