Hyderabad: బస్సు అద్దాన్ని పగలగొట్టిన, కండక్టర్‌పై పామును విసిరిన మహిళ
మద్యం మత్తులో ఉన్న ఓ మహిళ గురువారం సాయంత్రం రద్దీగా ఉండే విద్యానగర్ కూడలిలో బస్సు వెనుక అద్దాన్ని పగులగొట్టి కండక్టర్‌పై పామును విసిరేసింది.
By అంజి Published on 9 Aug 2024 9:00 AM ISTHyderabad: బస్సు అద్దాన్ని పగలగొట్టిన, కండక్టర్‌పై పామును విసిరిన మహిళ
హైదరాబాద్: మద్యం మత్తులో ఉన్న ఓ మహిళ గురువారం సాయంత్రం రద్దీగా ఉండే విద్యానగర్ కూడలిలో బస్సు వెనుక అద్దాన్ని పగులగొట్టి కండక్టర్‌పై పామును విసిరేసింది.
నల్లకుంట ఇన్‌స్పెక్టర్ జగదీశ్వర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. దమ్మాయిగూడకు చెందిన ఫాతిమాబీబీ అలియాస్ అసిమ్(65) వృద్ధురాలు విద్యానగర్ కూడలిలో దిల్‌సుక్‌నగర్ డిపోకు చెందిన 107 వీ/ఎల్ బస్సును ఆపేందుకు ప్రయత్నించగా ఈ ఘటన చోటుచేసుకుంది.
కూడలిలో రద్దీ ఎక్కువగా ఉండటంతో, డ్రైవర్ ఆ ప్రదేశంలో బస్సును ఆపకూడదని నిర్ణయించుకున్నాడు. అది ఫాతిమాబీబీకి కోపం తెప్పించింది. దీంతో కోపోద్రిక్తులైన ఫాతిమాబీబీ ఖాళీ బీరు బాటిల్‌తో బస్సు అద్దాన్ని ధ్వంసం చేయడంతో డ్రైవర్ వాహనాన్ని ఒక్కసారిగా నిలిపివేశాడు. కండక్టర్ స్వప్న.. ఫాతిమాబీబీను ఎదుర్కొనేందుకు బస్సు నుండి బయటకు వచ్చి ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేసింది.
ఈ సంఘటనలలో ఫాతిమాబీబీ తన బ్యాగ్‌లో పాము ఉందని వెల్లడించి స్వప్నను బెదిరించింది. అనంతరం నాలుగు అడుగుల పొడవున్న పామును స్వప్నపైకి విసిరింది. స్వప్నపై పడిన పాము ఆపై నేలపైకి జారడంతో ప్రయాణికులు, చుట్టుపక్కల ప్రజలు భయంతో పరుగులు తీశారు.
వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బేగంను అదుపులోకి తీసుకున్నారు. పాము కోసం గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. ఘటన జరిగిన సమయంలో ఫాతిమాబీబీ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. మహిళ బ్యాగులో పాము ఎందుకు ఉందో ఆరా తీస్తున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని, ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని ఇన్‌స్పెక్టర్ జగదీశ్వర్ రావు తెలిపారు.