హైదరాబాద్: స్మగ్లర్లు రోజు రోజుకి పుష్ప రాజ్ తెలివిని మించిన పథకాలు వేసి అక్రమంగా బంగారాన్ని రవాణా చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అధికారులు కూడా తగ్గేదే లే అన్నట్లుగా వ్యవహరిస్తూ వారిని పట్టుకుంటున్నారు. అక్రమంగా బంగారాన్ని ఎయిర్‌పోర్ట్, ట్రైన్ ద్వారా తీసుకువస్తూ అధికారుల చేతికి చిక్కుతున్నారు. తాజాగా పోలీసులు ఏమాత్రం గుర్తించకుండా ఉండేందుకు ఓ ఇద్దరు నిందితులు సరికొత్త పద్ధతిలో బంగారాన్ని హైదరాబాద్ నగరానికి తరలించేందుకు ప్రయత్నం చేసి చివరకు పోలీసుల చేతికి చిక్కి శ్రీకృష్ణ జన్మస్థానానికి చేరుకున్నారు.
ఇద్దరు నిందితులు పెద్ద ఎత్తున బంగారాన్ని తీసుకుని కోల్‌కతా నుండి హైదరాబాదుకు బస్సులో ప్రయాణం చేస్తూ వస్తున్నారు. అయితే డీఆర్‌ఐ అధికారులకు పక్కా సమాచారం రావడంతో వెంటనే వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే బస్సును ఆపి తనిఖీలు నిర్వహించగా ఇద్దరు వ్యక్తుల వద్ద బంగారు బిస్కెట్లు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుండి దాదాపు మూడు కోట్ల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసిన డీఆర్‌ఐ అధికారులు, నిందితులను విచారిస్తున్నారు.