డబుల్ డెక్కర్ బస్సులు, మ్యూజికల్ ఫౌంటెన్‌తో.. సందడిగా సండే ఫన్‌డే

Double-decker bus, musical fountain wow Sunday Funday visitors. హైదరాబాద్: చాలా గ్యాప్ తర్వాత నిన్న ట్యాంక్ బండ్ వద్ద తిరిగి ప్రారంభమైన సండే

By అంజి  Published on  20 Feb 2023 10:40 AM IST
డబుల్ డెక్కర్ బస్సులు, మ్యూజికల్ ఫౌంటెన్‌తో.. సందడిగా సండే ఫన్‌డే

హైదరాబాద్: చాలా గ్యాప్ తర్వాత నిన్న ట్యాంక్ బండ్ వద్ద తిరిగి ప్రారంభమైన సండే ఫండే కార్యక్రమంలో వేలాది మంది సందర్శకులు హుస్సేన్ సాగర్‌లో కొత్తగా ప్రారంభించిన డబుల్ డెక్కర్ బస్సులు, మ్యూజికల్ ఫౌంటెన్‌ను తిలకించారు. ఈ కార్యక్రమంలో రాత్రి 7 గంటల నుంచి 10 గంటల మధ్య జరిగిన మ్యూజికల్‌ ఫౌంటెన్‌ షోను చూసి ప్రజలు ఆనందించారు. ఆస్కార్‌కు నామినేట్ అయిన నాటు నాటుతో సహా వివిధ పాటల ట్యూన్‌లకు ఫౌంటెన్ అలలు డ్యాన్స్ చేస్తూ కనిపించాయి.

అంతే కాకుండా ట్యాంక్‌బండ్‌లోని తినుబండారాల స్టాల్స్‌లో విపరీతమైన రద్దీ కనిపించింది. సండే ఫండే నిర్వాహకులు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఉచితంగా మొక్కలు పంపిణీ చేశారు. హెచ్‌ఎండీఏ ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో దాదాపు 5000 వివిధ రకాల మొక్కలు ఉన్నాయి.

ఈ సందర్భంగా అధికారులు ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్‌ను ఆంక్షలు చేసి రోడ్డుపై బారికేడ్‌ వేశారు.

మ్యూజికల్ ఫౌంటెన్, డబుల్ డెక్కర్ బస్సులు ఆదివారం ఫండే కార్యక్రమాన్ని ఆకర్షణీయంగా మార్చాయి ఇటీవలే ప్రారంభించబడిన డబుల్ డెక్కర్ బస్సు, భారతదేశంలోనే అతిపెద్ద మ్యూజికల్ ఫ్లోటింగ్ ఫౌంటెన్‌ను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) హుస్సేన్ సాగర్‌లో ఇటీవల ప్రారంభించడం సండే ఫండే ఈవెంట్‌ను ఆకర్షణీయంగా చేసింది. ఎన్టీఆర్ మార్గ్ సమీపంలో ప్రారంభించిన ఫౌంటెన్ సుమారు 90 మీటర్ల ఎత్తులో ఉంది. దీని పొడవు 180 మీటర్లు, వెడల్పు 10 మీటర్లు. రూ.17.02 కోట్లతో దీనిని అభివృద్ధి చేశారు.

మ్యూజికల్ ఫ్లోటింగ్ ఫౌంటెన్‌లో అనేక అసాధారణమైన ఫీచర్లు ఉన్నాయి. ఇందులో మూడు లేజర్ సెట్‌లు ఉన్నాయి. వీటిలో అనేక రకాల థీమ్‌లు, మిస్ట్ ఫెయిరీ ఫాగ్, మ్యూజిక్‌తో పాటు క్లౌడ్ ఎఫెక్ట్‌ను సృష్టించడం, 800 జెట్ హై-పవర్ నాజిల్‌లు, డైనమిక్ విజువల్‌కు జోడించే 880 ఎల్‌ఈడీ లైట్లు నీటి అడుగున ఉన్నాయి.

మరోవైపు ఇటీవల మూడు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించడంతో డబుల్ డెక్కర్ బస్సులు హైదరాబాద్ రోడ్లపైకి వచ్చాయి. హైదరాబాద్‌లో దీనికి చారిత్రక ప్రాధాన్యం ఉంది. నిజాం కాలం నుంచి 2003 వరకు నగరంలో తిరిగిన సంప్రదాయ డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ బస్సులు ప్రధానంగా ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, ప్యారడైజ్, నిజాం కాలేజీ స్ట్రెచ్‌లను కవర్ చేసే రేస్ ట్రాక్ చుట్టూ తిరుగుతున్నాయి.

కేటీఆర్ చొరవ చూపించారు

ట్యాంక్ బండ్ నగరం మధ్యలో ఉన్నందున, హైదరాబాద్ పౌరులకు ఇది పురాతన హ్యాంగ్‌అవుట్ స్పాట్‌లలో ఒకటి కాబట్టి, నగరం నలుమూలల నుండి చాలా మంది ప్రజలు విశ్రాంతి సమయాన్ని గడపడానికి, ముఖ్యంగా సాయంత్రం పూట ఈ స్థలాన్ని సందర్శిస్తారు. ప్రజలు ఇక్కడి అందాలను ఆస్వాదించడానికి, పౌరుల భద్రతను దృష్టిలో ఉంచుకునేలా.. పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ట్యాంక్ బండ్ రహదారిపై ఆదివారం సాయంత్రం 5 నుండి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ రహితంగా ఉండాలని సూచించారు.

Next Story