హైదరాబాద్ నగరంలోని మెట్రో రైలు సేవల్లో మరోసారి అంతరాయం ఏర్పడింది. ఎల్బీనగర్ నుంచి మియాపూర్ మార్గంలో సుమారు 25 నిమిషాలుగా మెట్రో రైలు సేవలు నిలిచిపోయాయి. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వెలుతున్న మెట్రో రైళ్లను వివిధ స్టేషన్లలో నిలిపివేశారు.
రైళ్లు తిరిగి బయలుదేరేందుకు మరికొంద సమయం పడుతుందని స్టేషన్ సిబ్బంది చెబుతున్నారు. అయితే.. రైలు ఎందుకు ఆగిపోయిందనే విషయాన్ని మాత్రం ఇంతవరకు అధికారులు చెప్పలేదంటూ ప్రయాణీకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతిక లోపం కారణంగానే సేవలకు అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. అయితే.. దీనిపై ఇంత వరకు మైట్రో రైలు అధికారులు స్పందించ లేదు.
ఇదిలా ఉంటే.. గతంలో కూడా పలు సందర్భాల్లో హైదరాబాద్ మెట్రో రైళ్లల్లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. ప్రయాణికుల రద్దీ బాగా ఉన్న సమయంలో అనుకోకుండా రైళ్లు ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇలా అర్థాంతరంగా మెట్రో రైళ్లు ఆగిపోతుండడంతో ప్రయాణికులు తీవ్ర అయోమయం, గందరగోళానికి గురవుతున్నారు.