చలాన్ల రాయితీకి విశేష స్పందన.. ఒక్క రోజులో 5 ల‌క్ష‌ల చలాన్ల క్లియ‌ర్‌

Discounted challan payment elicits huge response.తెలంగాణ రాష్ట్రంలో వాహ‌నాల పెండింగ్ చలానాల‌ను చెల్లించేందుకు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 March 2022 9:13 AM IST
చలాన్ల రాయితీకి విశేష స్పందన.. ఒక్క రోజులో 5 ల‌క్ష‌ల చలాన్ల క్లియ‌ర్‌

తెలంగాణ రాష్ట్రంలో వాహ‌నాల పెండింగ్ చలానాల‌ను చెల్లించేందుకు వాహ‌న‌దారులు పోటీప‌డ్డారు. తొలి రోజు(మార్చి 1) మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజాము నుంచే వెబ్‌సైట్ అందుబాటులోకి రావ‌డంతో వాహ‌నదారులు త‌మ చలాన్ల‌ను చెల్లించ‌డం ప్రారంభించారు. హైద‌రాబాద్, సైబ‌రాబాద్‌, రాచ‌కొండ పోలీసు క‌మిష‌న‌రేట్ల ప‌రిధిలో ప్ర‌తి సెక‌నుకు 12 చ‌లాన్ల చొప్పున మొత్తం 5 ల‌క్ష‌లకుపైగా పెండింగ్ ‌చలాన్లు క్లియ‌ర్ అయిపోయాయి. దీని ద్వారా రూ.5.5 కోట్ల మేర ఆదాయం వ‌చ్చింది. అయితే.. ఒక్క‌సారిగా వాహనదారులు పోటెత్తడంతో వెబ్‌సైట్‌ పలుమార్లు మొరాయించింది.

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో రూ.600 కోట్ల పైచిలుకు పెండింగ్ చలాన్లు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ క్ర‌మంలో వీటిని వ‌సూలు చేసేందుకు చెల్లింపులో రాయితీ క‌ల్పించారు. ద్విచక్ర వాహనదారులకు 75 శాతం, ఆటోలకు 70 శాతం, కార్లకు 50 శాతం, మాస్కుకు 90 శాతం రాయితీ ఇచ్చారు. ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకునేందుకు వాహాన‌దారులు 'ఈ-చలాన్' వైబ్‌సైట్‌కు క్యూ క‌ట్టారు. 'ఈ-చలాన్‌' వెబ్‌సైట్‌కు వెళ్లి వివరాలు ఎంటర్‌ చేస్తే.. గతంలో మీ వాహనంపై ఉన్న చలాన్లు.. వాటికి వేసిన సర్‌ ఛార్జ్‌తో పాటు.. డిస్కౌంట్‌ తర్వాత మీరు చెల్లించాల్సిన మొత్తాన్ని చూపిస్తోంది. నెట్‌బ్యాంకింగ్‌, యూపీఐడీల ద్వారా చెల్లింపులు చేయ‌వ‌చ్చు. కాగా.. మార్చి 31 వ‌ర‌కు ఈ అవ‌కాశం ఉంద‌ని ఉన్న‌తాధికారులు చెబుతున్నారు.

పెండింగ్‌ ఈ చలాన్లు క్లియర్‌ చేసుకోవడానికి ఈ నెల చివ‌రి వ‌ర‌కు అవ‌కాశం ఉంద‌ని ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. ఈ సేవ‌, మీ సేవ సెంట‌ర్ల‌లో కూడా క్లియ‌రెన్స్ చేసుకోవ‌చ్చున‌న్నారు. ఈ అవకాశాన్ని ఉల్లంఘనదారులు ఉపయోగించుకొని.. తమ వాహనాలపై ఉన్న చలాన్లను క్లియర్‌ చేసుకోవాలి. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి. ఉల్లంఘనలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి వాహనదారుడిపై ఉంటుందన్నారు.

Next Story