డీసీపీ, డింపుల్ ల మధ్య ముదురుతున్న వివాదం
Dimple Hayati vs Rahul Hegde. ఐపీఎస్ అధికారి, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే, హీరోయిన్ డింపుల్ హయతి మధ్య వివాదం
By M.S.R Published on 23 May 2023 8:07 PM ISTఐపీఎస్ అధికారి, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే, హీరోయిన్ డింపుల్ హయతి మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఒకే అపార్ట్‌మెంట్‌లో నివాసముంటోన్న రాహుల్ హెగ్డే, డింపుల్ హయతీల మధ్య పార్కింగ్ ప్లేస్ విషయంలో చాలా రోజులుగా గొడవ నడుస్తోంది. పార్క్ చేసి ఉన్న తన అధికారిక కారును డింపుల్ బీఎండబ్ల్యూ కారుతో ఢీకొట్టారని.. అంతేకాకుండా కాలితో తన్నారని ఆరోపిస్తూ ఆమెపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాహుల్ హెగ్డే కారు డ్రైవర్, కానిస్టేబుల్ చేతన్ కుమార్ డింపుల్ పై కేసు పెట్టారు. విచారణలో భాగంగా జూబ్లీహిల్స్ పోలీసులు డింపుల్ హయతీతో పాటు ఆమె స్నేహితుడు విక్టర్ డేవిడ్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ మూడు గంటలపాటు కూర్చోబెట్టారని డింపుల్ ఆరోపిస్తున్నారు. పోలీసుల తీరుపై తాను కోర్టుకు వెళ్తానని డింపుల్ అంటున్నారు. ఈ కేసు విచారణకు కోర్టులో హాజరుకావాలని డింపుల్ హయతీకి పోలీసులు 41 సీఆర్‌పీసీ కింద నోటీసు ఇచ్చారు.
డింపుల్ హయాతి తరఫు న్యాయవాది పాల్ సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. డీసీపీ రాహుల్ హెగ్డే ఉద్దేశపూర్వకంగా వేధించేందుకు కేసు పెట్టారని.. అధికారం అడ్డుపెట్టుకుని కేసు పెట్టించారన్నారు. డింపుల్ హయాతిపై తప్పుడు కేసు పెట్టారన్నారు. ప్రభుత్వం కేటాయించిన క్వార్టర్స్ కాకుండా డీసీపీ ఈ అపార్ట్ మెంట్ లో ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారు. డీసీపీ ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేస్తున్నారన్నారు. డింపుల్ హయాతితో డీసీపీ హెగ్డే చాలాసార్లు అమర్యాదగా ప్రవర్తించారన్నారు. డింపుల్ పార్కింగ్ స్థలంలో కోన్స్ పెట్టారని, ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో ఆమె అసహనానికి గురై కోన్స్‌ను కాలితో తన్నారని తెలిపారు. ఆ సీసీ ఫుటేజీ అడ్డుపెట్టుకుని డింపుల్ పై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. పార్కింగ్ విషయంలో సమస్యలు సృష్టించిన డీసీపీపై కేసు పెడతానని డింపుల్ అనడంతో డీసీపీ ఆమెను వేధించాలనే ఉద్దేశంతో కేసు పెట్టారన్నారు.