హైదరాబాద్ పాతబస్తీలోని ఆస్పత్రిలో బుధవారం వింత శిశువు జన్మించింది. ఆ శిశువు శరీరం అచ్చం చేపలా ఉంది. అయితే.. ఆ శిశువు పుట్టిన కొద్దిసేపటికే మృతి చెందింది. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ గర్భిణీకి నెలలు నిండంతో ప్లేట బురుజు ఆస్పత్రికి వచ్చింది. ఆ మహిళ ప్రసవించిన బిడ్డను చూసి తొలుత డాక్టర్లు ఆశ్చర్యపోయారు. శిశివులో చెవితో పాటు చేతి వేళ్లు సక్రమంగా అభివృద్ది చెందలేదు. రెండు కాళ్లు కలిసిపోయి చేప ఆకారాన్ని తలపించాయి. అయితే.. పుట్టిన కాసేపటికే ఆ శిశువు ప్రాణాలు కోల్పోయింది. క్రోమోజోముల విశ్లేషణతో పాటు ఇతర ఇన్‌ఫెక్షన్ల ప్రభావం తెలుసుకునేందుకు ఫ్లసంటా(మాయ)ను బయాప్సీకి పంపినట్లు డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం తల్లి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు.
కాగా.. దీనిపై గాంధీ ఆస్పత్రి ప్రసూతి విభాగాధిపతి డాక్టర్ మహాలక్ష్మి మాట్లాడుతూ.. శిశువు తల్లి కడుపులో ఉన్నప్పుడు మొదటి 8-12 వారాలు ఎంతో కీలకమన్నారు. మత్తుపదార్థాల వినియోగం, ఇన్‌ఫెక్షన్లు, పోషకాహారం, పోలీక్ యాసిడ్ లోపంతో ఇలాంటి శిశువులు జన్మించే అవకాశాలు ఉన్నాయన్నారు. మేనరిక వివాహాల వల్ల కూడా జన్యపరమైన లోపాలు తలెత్తి ఇలా జరుగుతుందన్నారు. స్కానింగ్‌లో కూడా లోపాలను కనిపెట్టే పరిస్థితి ఉండకపోవచ్చునని చెప్పారు.