Hyderabad: '6 నెలలుగా జీతాలు లేవు'.. ఆన్‌పాసివ్ కంపెనీ ఉద్యోగుల ధర్నా
మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్‌పాసివ్ టెక్నాలజీస్ ఉద్యోగులు ధర్నా చేపట్టడంతో ఉధృత వాతావరణం నెలకొంది.
By అంజి Published on 22 July 2024 8:33 AM GMTHyderabad: '6 నెలలుగా జీతాలు లేవు'.. ఆన్‌పాసివ్ కంపెనీ ఉద్యోగుల ధర్నా
హైదరాబాద్: మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్‌పాసివ్ టెక్నాలజీస్ ఉద్యోగులు ధర్నా చేపట్టడంతో ఉధృత వాతావరణం నెలకొంది. ఆ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగులకు గత ఆరు నెలలుగా జీతాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఒకవైపు ఆర్థిక సమస్యలు.. మరోవైపు జీతం రాక ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. దీంతో ఉద్యోగులందరూ ధర్నా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆ కంపెనీలో పని చేస్తున్న 200 మంది ఉద్యోగులు రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేపట్టారు.
6 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని ఆందోళనకు దిగామని ఉద్యోగులు తెలిపారు. ఆరు నెలలు జీతాలు లేకుండా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని ఉద్యోగులు వాపోయారు. ప్రతీ ఎంప్లాయ్‌కి 10 సంవత్సరాల అనుభవం ఉందన్నారు. పే స్లిప్, పీఎఫ్ కరెక్ట్‌గా లేకపోవడంతో వేరేచోట ఉద్యోగాలు ఇవ్వట్లేదంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు, రేపు అంటూ కంపెనీ యాజమాన్యం కాలాన్ని తోసుకొస్తున్నారని అన్నారు. కొన్ని నెలలగా జీతాలు ఇవ్వకపోవడంతో ఆగ్రహం చెందిన ఉద్యోగులు కంపెనీపై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
తమ జీతాలను వెంటనే చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. జీతాలు చెల్లిస్తే తమ విధులను నిర్వహించడానికి తాము ఎప్పుడు సిద్ధమేనని ఉద్యోగులు అంటున్నారు. తమకు రావలసిన జీతాన్ని ఇచ్చేవరకు ఉద్యమాన్ని విరమించమని ఉద్యోగులు చెప్పారు. వి వాంట్ జస్టిస్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉద్యోగులందరూ ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.