షార్ట్ సర్క్యూట్ కారణం కానే కాదు.. ఇంకేంటి..?
Deccan Nightwear building fire Incident. సికింద్రాబాద్ లోని డెక్కన్ నైట్ స్టోర్ లో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది.
By M.S.R Published on 20 Jan 2023 6:17 PM ISTసికింద్రాబాద్ లోని డెక్కన్ నైట్ స్టోర్ లో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంతో భవనం మొత్తం పూర్తిగా కాలి బూడిదైంది. ఆరు అంతస్థుల్లో మంటల ధాటికి భవనం పూర్తిగా దెబ్బతింది. భవనంలోని కొన్ని ఫ్లోర్లలో స్లాబ్ లు కుప్పకూలిపోయాయి. ఈ భవనం బలహీనంగా ఉందని వరంగల్ నిట్ డైరెక్టర్ రమణారావు చెప్పారు. ఈ భవనం కూల్చివేస్తే పక్క భవనాలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని రమణారావు అభిప్రాయపడ్డారు. సుమారు 11 గంటల పాటు శ్రమించిన తర్వాత ఈ భవనంలో మంటలను ఫైర్ ఫైటర్లు అదుపులోకి తీసుకు వచ్చారు.
ఈ అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం కాదని విద్యుత్ శాఖాధికారి శ్రీధర్ చెప్పారు. డెక్కన్ నైట్ స్టోర్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగితే సెల్లార్ నుండి మంటలు వ్యాపించేవని.. భవనంలో పై నుండి కిందకు మంటలు వ్యాపించాయని చెప్పారు. భవనంలో మంటలు వ్యాపిస్తున్న సమయంలో కూడా ఈ భవనంలో ఉన్న విద్యుత్ మీటర్లలో విద్యుత్ ఉందని శ్రీధర్ చెప్పారు. ఈ భవనంలో అగ్ని ప్రమాదం జరిగిందని తమకు సమాచారం రాగానే ఈ ప్రాంతంలో విద్యుత్ ను నిలిపివేసినట్టుగా విద్యుత్ అధికారులు తెలిపారు. ఉదయం 11:20 గంటల నుండి సాయంత్రం 06:20 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేసినట్టుగా తెలిపారు. గురువారం సాయంత్రం పోలీసుల అనుమతితో ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను పునరుద్దరించినట్టుగా విద్యుత్ శాఖాధికారి శ్రీధర్ చెప్పారు. అగ్నిప్రమాదం జరిగిన భవనం మినహా ఈ ప్రాంతమంతా విద్యుత్ ను పునరుద్దరించినట్టు తెలిపారు.