బండ్లగుడ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెల్లడించిన డీసీపీ
సంచలనం సృష్టించిన బండ్లగుడకు చెందిన షేక్ సయీద్ బావజిర్ హత్య కేసు
By Medi Samrat Published on 16 Aug 2023 1:09 PM GMTసంచలనం సృష్టించిన బండ్లగుడకు చెందిన షేక్ సయీద్ బావజిర్ హత్య కేసు వివరాలను డీసీపీ రూపేష్ వెల్లడించారు. ఈ కేసు విచారణలో భాగంగా నిందితులను పట్టుకునేందుకు మొత్తం ఎనిమిది టీమ్ లను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు ప్రధాన నిందితులు ఉన్నట్లు డీసీపీ వెల్లడించారు. నిందితులలో నలుగురిని రిమాండ్‌కు తరలించగా.. మరో ఇరువురు నిందితులు సాలేహ్ సాదీ(ఏ4), ఓమర్ సాదీ(ఏ5) పరారీలో ఉన్నట్లు తెలిపారు.
మృతుడు షేక్ సయీద్ బావజిర్ కు.. నిందితుడు ఏ-1 హజీబ్‌కు 2021లో జైళ్లో పరిచయం అయ్యిందని తెలిపారు. షేక్ సయీద్ బావజిర్ పై గతంలో 9 కేసులుండగా.. హజీబ్ పై కూడా ఆరు కేసులు ఉన్నాయి. ఇరువురిపై రౌడీ షీట్ ఉన్నట్లు వెల్లడించారు. ఆ ఇరువురికి జైళ్లోనే హోమో సెక్స్(స్వలింగ సంపర్కం) రిలేషన్ షిప్ ఏర్పడిందని.. జైలు నుండి బయటికి వచ్చిన తరువాత కూడా వారు ఆ రిలేషన్ కొనసాగించారని తెలిపారు. ఈ క్రమంలోనే మృతుడు తన కోరికలు తీర్చుకోవడానికి హజీబ్‌ను తన స్నేహితులను తీసుకురావాలని అడిగేవాడు.
అయితే.. షేక్ సయీద్ బావజిర్ తన యూ ట్యూబ్ ఛానల్ ద్వారా జల్‌పల్లిలో అభివృద్ధి జరగడం లేదంటూ న్యూస్ టెలికాస్ట్ చేస్తూ బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్నాడు. దీంతో ఎలాగైనా షేక్ సయీద్ బావజిర్‌ను హత్య చేయాలని జల్‌పల్లి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్లా సాధి(ఏ2), అహ్మద్ సాధి(ఏ3)లు ప్లాన్ వేశారు. ప్లాన్‌లో భాగంగానే హజీబ్ సహాయంతో బావజీర్ అడ్డు తొలగించుకోవాలని చూశారు. ఇందులో భాగంగానే హత్యకు 13 లక్షలు సుఫారీ ఇచ్చేందుకు కూడా ఒప్పుకున్నారు.
ప్లాన్‌లో భాగంగా హోమో సెక్స్ కోసం ఓ అబ్బాయిని తీసుకొని వస్తున్నాని చెప్పి నిందితుడు హజీబ్ తన స్నేహితుడైన మరో నిందితుడు అయూబ్(ఏ6) ను బావజిర్ వద్దకు తీసుకువెళ్లాడు. బావజిర్.. అయూబ్‌తో శృంగారంలో పాల్గొనేందుకు ప్రయత్నించాడు. కానీ అయూబ్ నిరాకరించాడు. ఆ తర్వాత హజీబ్.. బావజిర్‌ను కత్తితో పొడిచి హత్య చేశాడు. అయితే.. హోమో సెక్స్ విషయంలోనే గొడవ జరిగినట్లు.. ఆ గొవలోనే బావజిర్ హత్య జరిగినట్లుగా చిత్రీకరించాలని హజీబ్ ప్లాన్ వేశాడు.
అయితే పోలీసుల దర్యాప్తులో బావజీర్ హత్య వెనుక బ్లాక్ మెయిల్ ప్రధాన కారణంగా తేలింది. గతంలోనూ ఒకసారి బావజీర్ పై హత్యాయత్నం చేశారని వెల్లడించారు. పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు వచ్చినా వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు.షేక్ బావజీర్‌తో పాటు హజీబ్ కి గతంలోనే కౌన్సిలింగ్ ఇచ్చామని.. బ్లాక్ మెయిల్స్ కు పాల్పడవద్దని హెచ్చరించామని వెల్లడించారు. బావజీర్ డెడ్ బాడీపై జాతీయ జెండా కప్పిన వైనంపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితులను మరోసారి కస్టడీలోకి తీసుకుంటామని వెల్లడించారు.