'నాణ్యమైన హెల్మెట్ మాత్రమే ధరించండి'.. సైబరాబాద్ పోలీసుల వినూత్న వీడియో
రోడ్డు ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు యువతరానికి ట్రాఫిక్ నిబంధనలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.
By అంజి Published on 13 July 2023 9:53 AM IST'నాణ్యమైన హెల్మెట్ మాత్రమే ధరించండి'.. సైబరాబాద్ పోలీసుల వినూత్న వీడియో
ఇది ఉరుకులు.. పరుగుల జీవితం. ఇక్కడ మనం వేగానికి ఇచ్చిన ప్రాధాన్యత భద్రతకు ఇవ్వలేకపోతున్నాం.. దీని కారణంగా కొన్ని సందర్భాల్లో భారీ మూల్యం చెల్లించక తప్పడంలేదు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా.. నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. రోడ్డు ప్రమాదంలో హెల్మెట్ ధరించకపోవడంతో చాలామంది అక్కడికక్కడే మృతిచెందిన, గాయాలైన సందర్భాలు నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. వాహనదారుల నిర్లక్ష్య ధోరణి కారణంగా అమాయకులు తమ ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే రోడ్డు ప్రమాదాల విషయంలో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండదు. మోటారు వాహనాల చట్టం 1998లోని 129, 177సెక్షన్ల ప్రకారం.. బైక్ నడిపే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి.
ఈ క్రమంలోనే రోడ్డు ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు యువతరానికి ట్రాఫిక్ నిబంధనలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సూపర్‌స్టార్ రజినీకాంత్ సినిమాలోని ఓ సీన్‌ని తీసుకుని ఈ వీడియో రూపొందించారు. వీడియోలో.. హాఫ్ హెల్మెట్, లో క్వాలిటీ హెల్మెట్, స్ట్రాప్ లేని హెల్మెట్‌ని బయటకి వెళ్లమన్న రజినీకాంత్.. ఫుల్ కవర్డ్, ఐఎస్‌ఐ మార్క్ హెల్మెట్‌ని మాత్రమే ఇంట్లో ఉండమని చెబుతాడు. దీంతో వీడియో ముగుస్తుంది. ఇది ప్రజా ప్రయోజనం కోసం రూపొందించబడిందని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
ఈ సంవత్సరం సైబరాబాద్ పరిధిలో 214 మంది బైక్ పై ప్రయాణించే వారు చనిపోయారు. అందులో 86 శాతం మంది హెల్మెట్ పెట్టుకోలేదు. కొంత మంది హెల్మెట్ పెట్టుకున్న నాసిరకం హెల్మెట్ ధరించినందు వలన చనిపోయారు.నాణ్యమైన హెల్మెట్ ధరించండి. సురక్షితంగా ఉండండి. pic.twitter.com/KwNRlMhxCe
— CYBERABAD TRAFFIC POLICE (@CYBTRAFFIC) July 12, 2023
''ఈ సంవత్సరం సైబరాబాద్ పరిధిలో 214 మంది బైక్ పై ప్రయాణించే వారు చనిపోయారు. అందులో 86 శాతం మంది హెల్మెట్ పెట్టుకోలేదు. కొంత మంది హెల్మెట్ పెట్టుకున్న నాసిరకం హెల్మెట్ ధరించినందు వలన చనిపోయారు. నాణ్యమైన హెల్మెట్ ధరించండి. సురక్షితంగా ఉండండి.'' అని వీడియో క్యాప్షన్‌లో సైబరాబాద్ పోలీసులు తెలిపారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు పోయే సందర్భాలు చాలా తక్కువ. దీనివల్ల ముప్పు చాలా వరకు తప్పుతుంది.