సైబరాబాద్‌లో ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ సేవలు ప్రారంభం.. వీళ్ల పని ఇదే.!

Cyberabad police launch Traffic Task Force. హైదరాబాద్‌లోని సైబరాబాద్‌లో రద్దీగా ఉండే కారిడార్‌, జంక్షన్‌లలో ట్రాఫిక్‌ను సులభతరం చేసేందుకు

By అంజి  Published on  7 Aug 2022 11:13 AM GMT
సైబరాబాద్‌లో ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ సేవలు ప్రారంభం.. వీళ్ల పని ఇదే.!

హైదరాబాద్‌లోని సైబరాబాద్‌లో రద్దీగా ఉండే కారిడార్‌, జంక్షన్‌లలో ట్రాఫిక్‌ను సులభతరం చేసేందుకు సైబరాబాద్ పోలీసులు ఆదివారం నాడు ట్రాఫిక్ టాస్క్‌ఫోర్స్ బృందాలను ప్రారంభించారు. సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర జెండా ఊపి ట్రాఫిక్ టాస్క్‌ఫోర్స్‌ వాహనాలను ప్రారంభించారు. పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని సీపీ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. ఇందుకోసం ఇద్దరు పోలీసులతో కూడిన ఆరు బృందాలను ఏర్పాటు చేశారు. సైబరాబాద్ ట్రాఫిక్‌ డీసీపీ శ్రీనివాస్ రావు పర్యవేక్షణలో ఈ బృందాలు పని చేస్తాయి.

ఒక సబ్ ఇన్‌స్పెక్టర్ ర్యాంక్‌ అధికారి ఈ బృందాలకు ఇన్‌ఛార్జ్‌గా ఉంటారు. పీక్‌ టైమ్‌లో ట్రాఫిక్‌ రద్దీగా ఉండే ఏరియాల్లో ఈ టాస్క్‌ఫోర్స్‌ బృందాలు పెట్రోలింగ్‌ చేస్తాయి. ఇందుకోసం ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసుల సమన్వయంతో పని చేస్తుంటారని సీపీ వెల్లడించారు. వాహనాలు సైరన్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌తో ఉంటాయి. అలాగే పోలీసులకు బాడీ కెమెరాలు, బ్రీత్ ఎనలైజర్లు, గాగుల్స్, వైర్‌లెస్ కమ్యూనికేషన్ సెట్, ఎల్‌ఈడీ లాఠీలు ఇస్తారు. పీఎఎస్‌ ద్వారా ట్రాఫిక్‌ సంబంధించిన అంశాలపై ప్రజలకు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ ఇస్తూంటారు.

చైన్‌ స్నాచింగ్‌లు జరిగితే వెంటనే అప్రమత్తమై స్నాచర్స్‌ను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు రోడ్డు దాటే విషయంలోనూ సాయం చేస్తుంటారని, వీరు పెట్రోలింగ్ చేసే సమయంలో ప్రజలకు వారి వాహనాలకు ఏదైనా సమస్య తలెత్తితే వీరు దగ్గరుండి సాయం చేస్తారని సీపీ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. మాదాపూర్ నుంచి ఐకియా రౌటరీ - లెమన్ ట్రీ - మైండ్ స్పేస్ తిరిగి ఐకియా, కేబుల్ బ్రిడ్జి నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 - ఐటీసీ కోహినూర్ తదితర ప్రాంతాల్లో ఈ వాహనాలు పెట్రోలింగ్ నిర్వహిస్తాయి.

Next Story