ఏబీవీపీ కార్యకర్త జుట్టు పట్టుకుని లాగిన కానిస్టేబుల్ సస్పెండ్
ఏబీవీపీ కార్యకర్త పట్ల దురుసుగా ప్రవర్తించిన మహిళా కానిస్టేబుల్‌పై పోలీసులు చర్యలు తీసుకున్నారు. కానిస్టేబుల్ అయేషాను సస్పెండ్ చేశారు.
By అంజి Published on 30 Jan 2024 3:24 AM GMTఏబీవీపీ కార్యకర్త జుట్టు పట్టుకుని లాగిన కానిస్టేబుల్ సస్పెండ్
హైదరాబాద్: రాజేంద్రనగర్‌లోని అగ్రికల్చరల్ యూనివర్శిటీకి చెందిన ఓ మహిళా విద్యార్థినిపై నిరసన ప్రదర్శన సందర్భంగా జుట్టుతో ఈడ్చుకెళ్లిన మహిళా కానిస్టేబుల్‌పై సైబరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అవినాష్ మొహంతి సోమవారం సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. క్యాంపస్‌లో 100 ఎకరాల స్థలాన్ని హైకోర్టు భవన నిర్మాణానికి కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ జరుగుతున్న నిరసనను అడ్డుకునేందుకు ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు రంగంలోకి దిగారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో నంబర్ 55 జారీచేసింది.
అయితే ఈ జీవో నెం.55 వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. వారికి ఏబీవీపీ నేతలు మద్దతు ఇస్తూ నిరసన చేపట్టారు. నిరసన సమయంలో స్కూటర్‌పై ఉన్న మహిళా కానిస్టేబుల్ ఏబీవీపీ సభ్యురాలు అయిన ఒక మహిళా విద్యార్థినిని జుట్టు పట్టుకుని లాగారు. దీంతో ఆమె కింద పడిపోయింది. దాని కారణంగా ఆమె గాయపడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. ఈ ఘటనపై సైబరాబాద్ సీపీ విచారణకు ఆదేశించారు. కానిస్టేబుల్ అయేషా దురుసుగా ప్రవర్తించిందని విచారణలో తేలింది. దీంతో అయేషాను సస్పెండ్ చేస్తూ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు.
ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రొ.జయశంకర్ యూనివర్సిటీలో ఏబీవీపీ మహిళా కార్యకర్త పట్ల ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ సీరియస్ అయ్యింది. వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ.. ఆమె ఆరోగ్య పరిస్థితి సహా పూర్తి వివరాలతో 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీని ఆదేశించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించింది.