సంక్రాంతి పండక్కి ఊరెళ్తున్నారా..? అయితే ఈ విషయం మీ కోసమే. తస్మాస్ జాగ్రత్త అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఊరెళ్లే ముందు మీ నగలు, నగదును భద్రపర్చుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తున్నారు. ప్రజలు, పోలీసుల మధ్య సమన్వయంతోనే చోరీలను నియంత్రించవచ్చని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. సంక్రాంతి పండుగకు సొంతూర్లకు వెళ్లే వారికి పలు సూచనలు చేశారు. కాలనీల్లో కొత్త వారి కదలికలపై తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ఇక బైక్‌లు, కార్లను ఇళ్ల ఆవరణలోనే పార్కింగ్ చేసుకోవాలన్నారు. విలువైన వస్తువులను బైక్‌లు, కార్లలో పెట్టొద్దన్నారు. ఇక ఇంట్లో ఏదో ఒక గదిలో లైటు వేసి ఉంచాలన్నారు. పేపరు, పాలవాడిని రావొద్దని చెప్పండి. టైమర్‌తో కూడిన లైట్లను ఇంట్లో అమర్చుకోవాలని, ఇంటి డోర్‌కు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రయాణం చేసేటప్పుడు బ్యాగులు దగ్గరే ఉంచుకోవాలన్నారు. ప్రజలు తమ ప్రాంతాల్లో గస్తీ ఏర్పాటుకు సహకరించాలి. దగ్గరలోని పోలీస్ స్టేషన్, బీట్‌కానిస్టేబుల్ నంబర్లను ఉంచుకోవాలన్నారు. నమ్మకమైన వాచ్‌మెన్‌ను నియమించుకోవాలి. బంగారు నగలు, నగదు బ్యాంకు లాకర్లలో పెట్టుకోవాలని సీపీ స్టీఫెన్ రవీంద్ర సూచించారు.