యాపిల్ బిజినెస్ పేరుతో భారీ మోసం.. హైదరాబాద్‌ వ్యాపారికి రూ.5.7 కోట్ల టోకరా!

హైదరాబాద్‌లోని నిజాంపేటకు చెందిన సింహాద్రి శివానంద్ అనే వ్యాపారవేత్తను పెట్టుబడుల పేరుతో నమ్మించి సుమారు ₹5.7 కోట్లు వంచించిన ఘటన వెలుగులోకి వచ్చింది.

By -  అంజి
Published on : 30 March 2026 10:22 AM IST

Cyberabad Fraud Case, Investment Scam, EOW Police, ₹5.7 Crore Cheat, Apple Business Fraud, Financial Crime Hyderabad, Nizampet Businessman

యాపిల్ బిజినెస్ పేరుతో భారీ మోసం.. హైదరాబాద్‌ వ్యాపారికి రూ.5.7 కోట్ల టోకరా!

హైదరాబాద్‌లోని నిజాంపేటకు చెందిన సింహాద్రి శివానంద్ అనే వ్యాపారవేత్తను పెట్టుబడుల పేరుతో నమ్మించి సుమారు ₹5.7 కోట్లు వంచించిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితుడి ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.

యాదాద్రి భువనగిరి జిల్లా హుస్సేనాబాద్‌కు చెందిన మంత్రి బాలకృష్ణ అనే వ్యక్తి 2021లో శివానంద్‌ను కలిశాడు. తనకు పండ్ల వ్యాపారంతో సహా పలు ఇతర వ్యాపారాలు ఉన్నాయని, తన వెంచర్లలో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మబలికాడు. నమ్మకం కుదిరించుకోవడం కోసం మొదట్లో చిన్న మొత్తంలో అప్పులు తీసుకుని, వాటిని సకాలంలో తిరిగి చెల్లించాడు. దీంతో బాలకృష్ణను శివానంద్ పూర్తిగా నమ్మారు.

ఆ తర్వాత, తనకు 'శ్రీరామ్ దేవ్‌ బాబా యాపిల్ ఏజెన్సీ'లో పెట్టుబడులు ఉన్నాయని, అందులో డబ్బు పెడితే నెలకు 3 శాతం వడ్డీతో పాటు అదనపు లాభాలు వస్తాయని బాలకృష్ణ ఆశ చూపాడు. ఇది నిజమని నమ్మిన శివానంద్ వివిధ విడతల్లో మొత్తం ₹5.7 కోట్లు బదిలీ చేశారు. అయితే, ఆ తర్వాత ఒప్పందం ప్రకారం లాభాలు ఇవ్వకపోగా, ఫోన్ చేస్తే స్పందించకుండా బాలకృష్ణ పరారయ్యాడు.

ఈ మోసంలో బాలకృష్ణ భార్య కవి, బంధువు ఎడపల్లి రమేష్ కూడా సహకరించినట్లు బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే 'యాపిల్ బిజినెస్' పేరుతో వీరు మరికొందరిని కూడా మోసం చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు, బాధితుడి నుంచి కాజేసిన సొమ్మును రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Next Story