తప్పుడు కథనాల వ్యాప్తిని అరికట్టండి: యూఎస్ కాన్సుల్ జనరల్
Curb spread of false narratives,says US Consul General. హైదరాబాద్ నగరంలోని అమెరికా కౌన్సులేట్ జనరల్ ఆఫీసుకు కొత్త కౌన్సుల్ జనరల్‌గా బాధ్యతలు చేపట్టిన జెన్నిఫర్ లార్సన్
By న్యూస్‌మీటర్ తెలుగు
హైదరాబాద్ నగరంలోని అమెరికా కౌన్సులేట్ జనరల్ ఆఫీసుకు కొత్త కౌన్సుల్ జనరల్‌గా బాధ్యతలు చేపట్టిన జెన్నిఫర్ లార్సన్ మీడియాతో మాట్లాడారు. తప్పుడు సమాచారం గురించి జర్నలిస్టులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని.. సమాజానికి తప్పుడు సమాచారం ఎంతో ముప్పును తెస్తుందని అన్నారు. తప్పుడు సమాచారం మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా వ్యాప్తి చెందడాన్ని మనం అరికట్టాల్సిన అవసరం ఉందని.. ఆ బాధ్యతను జర్నలిస్టులు తమ భుజాలపై మోయాలని అన్నారు. కొందరు తప్పుడు సమాచారాన్ని కావాలనే ప్రచారం చేస్తూ ఉంటారని.. జర్నలిస్టులు వాటిని వీలైనంత త్వరగా గుర్తించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. "తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయాలని చూస్తున్న వ్యక్తులు ఎప్పుడూ ఉంటారు. జర్నలిస్టులు ఆ సమాచారాన్ని గుర్తించడంలోనూ.. అలాంటి వార్తలు ప్రజలలో ప్రసారం అవ్వకుండా నిరోధించడంలో ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉండాలి" అని "Countering Disinformation for Telugu TV Journalists" అనే కార్యక్రమంలో ఆమె వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఓయూ క్యాంపస్‌లోని సీఎఫ్‌ఆర్‌డీ భవనంలో నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
జెన్నిఫర్ లార్సన్ చీఫ్ గెస్ట్ గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.. తప్పుడు సమాచారంపై పోరాడడానికి ఒస్మానియా యూనివర్సిటీ చేస్తున్న కృషిని ఆమె ప్రశంసించారు. ఫ్యాక్ట్ చెకింగ్ విషయంలోనూ, తప్పుడు సమాచారంపై పోరాడడంలోనూ జర్నలిస్టులకు తగిన శిక్షణ ఇస్తున్న డిపార్ట్మెంట్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్, ఓయూ యాజమాన్యానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. "తప్పుడు సమాచారాన్ని గుర్తించడానికి మనం వీలైనంత కష్టపడి పనిచేస్తూ ఉంటాం. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చెడు సమాచారంపై మనం ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూనే ఉండాలి, "అని ఆమె అన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, గౌరవ అతిథి ప్రొఫెసర్ డి.రవీందర్, తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడానికి తెలుగు జర్నలిస్టులకు శిక్షణ ఇచ్చేందుకు 104 ఏళ్ల చరిత్ర కలిగిన విద్యా సంస్థను ఎంపిక చేసినందుకు హైదరాబాద్‌లోని యుఎస్ కాన్సులేట్ జనరల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. విద్యా వ్యవస్థలలో తప్పుడు సమాచారం ఎలా ఇబ్బందిని సృష్టించిందో ఆయన వివరించారు. ఓయూలోని జర్నలిజం మరియు మాస్ కమ్యూనికేషన్ విభాగం ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, హెడ్ ప్రొ. స్టీవెన్‌సన్ కోహిర్ తెలుగు టీవీ జర్నలిస్టుల కోసం నిర్వహించిన మొట్టమొదటి-రకం శిక్షణా కార్యక్రమం ద్వారా ఏర్పడిన సానుకూల ప్రభావాన్ని పంచుకున్నారు."Countering Disinformation for Telugu TV Reporters" అనే ప్రాజెక్ట్ టీవీ జర్నలిస్టులకు ధృవీకరణ నిపుణులు(verification experts)గా శిక్షణ ఇచ్చే కార్యక్రమం. ఎనిమిది నెలల పాటు హైబ్రిడ్ విధానంలో శిక్షణను ఇచ్చారు. ఫేక్ న్యూస్‌లను అడ్డుకోడానికి జర్నలిస్టులను మెరుగ్గా సన్నద్ధం చేయడం, ప్రధాన స్రవంతి మీడియాలో తప్పుడు సమాచారం రాకుండా నిరోధించడం ఈ శిక్షణ ముఖ్య లక్ష్యం. జర్నలిస్టులు తమ రోజువారీ విధుల్లో తమ ఫ్యాక్ట్ చెక్ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేలా చేయడమేనని తెలిపారు.
జర్నలిస్టులు వివిధ రకాల తప్పుడు సమాచారం ధృవీకరణ పద్ధతుల్లో శిక్షణ పొందారు. వాస్తవ తనిఖీ సాధనాలు, పద్ధతులు.. ఓపెన్ డేటాను కనుగొనే పద్ధతులు.. తప్పుడు సమాచారంపై చట్టపరమైన అంశాలు.. వార్తలు లేదా వీడియోలు, చిత్రాలను ఎలా ధృవీకరించాలి, వాస్తవాన్ని తనిఖీ చేయాలంటే ఎలా..? సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ నియమాలు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలు పాటిస్తున్నామా లేదా అనే విషయాల గురించి తెలియజేశారు. శిక్షణ పొందిన వారిలో యాభై శాతం మంది మహిళా జర్నలిస్టులు, ఐదుగురు జర్నలిజం విభాగానికి చెందిన విద్యార్థులు.