హైదరాబాద్ మహా నగరంలో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ద్విచక్ర, త్రిచక్ర వాహనాల డ్రైవర్లు తమ వాహనాలను పార్కింగ్ ప్రదేశాల్లో నిలిపేలా చూడాలని హైదరాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) రంగనాథ్ ఆర్టీసీ, జీహెచ్‌ఎంసీ తదితర అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ, ఆర్టీసీ, రవాణా శాఖ, ఆటో యూనియన్లు, వీధి వ్యాపారుల సంఘాలతో ట్రాఫిక్ పోలీసులు సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలో ట్రాఫిక్ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైనా ఉందన్నారు.
ఆటో డ్రైవర్లు తమ వాహనాలను బస్టాప్‌లు లేదా బస్‌బేల వద్ద పార్క్ చేయవద్దని సూచించారు. నిబంధనలు పాటించని డ్రైవర్ల ఆటోలను సీజ్ చేస్తామని తెలిపారు. పదేపదే నిబంధనలను ఉల్లంఘించే వారిపై ఐపీసీ సెక్షన్ 341 కింద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తారు. అలాగే రోడ్లను ఆక్రమిస్తున్న చిరు వ్యాపారులను ఇతర ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. దసరాకు స్వగ్రామాలకు వెళ్లే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆర్టీసీ అధికారులు సమావేశం నిర్వహించారు.
డివైడర్లు, జీబ్రా లైన్ల వద్ద రూల్స్ పాటించకపోతే, వారిపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. వాహనదారులకు కనిపించేలా బోర్డులు ఏర్పాటు చేస్తామని రంగనాథ్ తెలిపారు. నగరంలో ఫ్రీ లెఫ్ట్, నో పార్కింగ్ బోర్డులను కూడా త్వరలో ఏర్పాటు చేయనున్నారు. బస్సులు బస్‌బేలలో కాకుండా రోడ్డుపైనే ఆగుతున్నాయని, దీంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని, ఈ విషయాన్ని పరిశీలించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.