మైన‌ర్లూ.. బండి న‌డిపితే అంతే

Crack down on minors driving Hyderabad Traffic Police file charge-sheets, instead of e-challans.లైసెన్స్ లేకుండా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Jun 2022 5:11 AM GMT
మైన‌ర్లూ.. బండి న‌డిపితే అంతే

లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్న మైనర్లపై తెలంగాణ పోలీసులు దృష్టి పెట్టారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే మైనర్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టడం మొదలుపెట్టారు. మైనర్లపై ఈ-చలాన్‌లు జారీ చేయకుండా చార్జ్ షీట్లు దాఖలు చేస్తున్నారు. 2022 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 1059 కేసుల్లో చార్జిషీట్లు దాఖలయ్యాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో గత నాలుగేళ్లలో 45 మంది మైనర్లు లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు గురయ్యారని హైదరాబాద్ జాయింట్ ట్రాఫిక్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు.

"లైసెన్స్ లేకుండా మైనర్లు డ్రైవింగ్ చేయడం ఆమోదయోగ్యమైనది కాదు, ఇప్పుడు ఛార్జ్ షీట్లు దాఖలు చేస్తున్నారు, " అని అన్నారాయన. "ఈ సంఖ్యను వీలైనంత తగ్గించాలని మేము భావిస్తున్నాము. కేసుల సంఖ్యను తగ్గించడానికి.. ఇలాంటి వాటిలో సాధ్యమైనంత ఎక్కువ కాలం జైలు శిక్ష విధించాలని మేము న్యాయవ్యవస్థకు లేఖ రాశాము" అని ఆయన వివరించారు. చార్జిషీటును సమర్పించడంతో పాటు మైనర్ డ్రైవింగ్ చేస్తూ చేసే నేరాల చరిత్రను కూడా పొందుపరిచినట్లు రంగనాథ్ తెలిపారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రతి రోజూ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న 20-25 మంది మైనర్లపై కేసులు నమోదు చేస్తున్నారు. ఈ డేటా ప్రకారం హైదరాబాద్ కమిషనరేట్‌లో ఏటా 7500-9000 మంది మైనర్లు లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నారు.

ఎన్ని కేసులు నమోదయ్యాయి?

7 జూన్ 2022 నాటికి, 2022 సంవత్సరంలో 2026 కేసులు బుక్ చేయబడ్డాయి. రూ. 81,200 జరిమానా వసూలు చేయబడింది. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్‌లోని నార్త్ డిస్ట్రిక్ట్ లోనే 1159 కేసులు నమోదయ్యాయి. అత్యధిక కేసులు అబిడ్స్‌లో నమోదయ్యాయి. సౌత్ డిస్ట్రిక్ట్ లో ఫలక్‌నుమాలో అత్యధికంగా లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసిన మైనర్లు 155 కాగా.. సైదాబాద్‌లో 154, నారాయణగూడలో 139 కేసులు నమోదయ్యాయి. ఉత్తరాది జిల్లాల కంటే దక్షిణ జిల్లా ఎక్కువ మొత్తంలో జరిమానాలు వసూలు చేసింది. దక్షిణ జిల్లాలో రూ.51,000, ఉత్తర జిల్లాలో రూ.30,200 వసూలు చేశారు. నాంపల్లి ఏరియాలో నమోదైన కేసుల నుంచి అత్యధికంగా రూ.19,000 జరిమానాలు వసూలు చేశారు. ఇక్కడ 51 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ కమిషనరేట్‌లో నమోదైన మొత్తం 65 కేసుల్లో మైనర్లను ఒకటి, రెండు రోజుల పాటు సమాజ సేవ చేయమని కోర్టులు పంపించాయి. రెండు రోజులు ఇద్దరికి సమాజసేవలు చేయమనగా.. 49 మందికి ఒక్కరోజు మాత్రమే సమాజసేవ చేసేలా కోర్టులు తీర్పును ఇచ్చాయి.

చట్టం ఏమి చెబుతోంది:

మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 181 ప్రకారం, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసే మైనర్లపై విచారణ చేయవచ్చు. సెక్షన్ 180 ప్రకారం, వాహనాల యజమానులపై కూడా విచారణ జరుగుతుంది. MV చట్టం, సెక్షన్ 181 ప్రకారం, వాహనం యజమానిపై కూడా కేసు బుక్ చేయబడుతుంది. డ్రైవింగ్ చేస్తూ బుక్ అయిన మైనర్, వాహనం యజమాని ఇద్దరూ కోర్టులో హాజరవ్వాల్సిందే కాకుండా కౌన్సెలింగ్‌కు కూడా హాజరు కావాలి.

MV యాక్ట్ సెక్షన్ 206 ప్రకారం, మైనర్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే ఒరిజినల్ డాక్యుమెంట్ (RC బుక్ లేదా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్) స్వాధీనం చేసుకునే అధికారం ట్రాఫిక్ పోలీసులకు ఉంటుంది. MV చట్టంలోని సెక్షన్ 207 ప్రకారం, మైనర్ ఒరిజినల్ డాక్యుమెంట్‌ను సమర్పించకపోతే, వాహనాన్ని సీజ్ చేసే (లేదా అదుపులోకి తీసుకునే) అధికారం ట్రాఫిక్ పోలీసులకు ఉంటుంది. మైనర్, యజమాని కౌన్సెలింగ్ సెషన్‌లు, ఇతర నిబంధనలను పూర్తి చేసిన తర్వాత మాత్రమే ట్రాఫిక్ పోలీసులు స్వాధీనం చేసుకున్న RC బుక్ లేదా వాహనం యజమానికి అందజేయబడుతుంది.

Next Story