హైదరాబాద్‌లో విషాదం.. కరెంట్‌ షాక్‌తో దంపతులు మృతి

హైదరాబాద్ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. బండ్లగూడలో శనివారం ఉదయం ఇంట్లో విద్యుదాఘాతంతో దంపతులు మృతి చెందారు.

By అంజి  Published on  9 Sep 2023 8:31 AM GMT
Couple died, electrocution, Hyderabad, Bandlaguda

హైదరాబాద్‌లో విషాదం.. కరెంట్‌ షాక్‌తో దంపతులు మృతి 

హైదరాబాద్ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. బండ్లగూడలో శనివారం ఉదయం ఇంట్లో విద్యుదాఘాతంతో దంపతులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తన్వీర్ (36), అతని భార్య షకీరా బేగం గత కొన్నాళ్లుగా బండ్లగూడలోని గౌస్‌నగర్‌లోని తమ ఇంట్లో ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటున్నారు. శనివారం ఉదయం షకీరాబేగం ఇంట్లోని నీటి పంపు స్విచ్ ఆన్ చేసేందుకు వెళ్లగా విద్యుదాఘాతానికి గురైంది. అది గమనించిన తన్వీర్ ఆమెను రక్షించేందుకు పరుగెత్తాడు. ఆమెను రక్షించే ప్రయత్నంలో అతను కూడా విద్యుదాఘాతానికి గురై కుప్పకూలిపోయాడు. అప్పటికే వారి అరుపులకు అప్రమత్తమైన ఇరుగుపొరుగు వారు ఇంట్లోకి చేరుకుని విద్యుత్‌ సరఫరా నిలిపివేసి ఇద్దరినీ విద్యుత్‌ తీగల నుంచి బయటకు తీశారు.

అయితే అప్పటికే ఇద్దరూ చనిపోయారు. సమాచారం అందుకున్న బండ్లగూడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. కరెంట్‌ షాక్‌ ప్రమాదాలు ఇటీవల పెరుగుతున్నాయి. వెలుగులు విరజిమ్మే కరెంట్‌..ప్రాణాలు తీసే యమపాశంగా మారుతోంది. విద్యుత్‌ ప్రమాదాలతో ప్రజలు మృత్యువాత పడుతున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వంటి తదితర కారణాలతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వానకాలంలో నీటి పంపు మోటర్ల వద్ద సరైన జాగ్రత్తలు పాటించకపోవడంతో తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారు. కరెంట్‌ విషయంలో కనీస అవగాహన ఉండి, అప్రమత్తంగా ఉంటే విద్యుత్‌ ప్రమాదాలను నివారించవచ్చు.

Next Story