విద్యాసంస్థలో పార్ట్‌నర్‌షిప్ అంటూ రూ.కోట్లు స్వాహా.. దంపతులు అరెస్ట్
విద్యాసంస్థలో భాగస్వామ్యం ఇస్తామంటూ ఎన్నారైని మోసగించిన కేసులో భార్యాభర్తలను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.
By అంజి Published on 3 Sept 2023 10:00 AM ISTవిద్యాసంస్థలో పార్ట్‌నర్‌షిప్ అంటూ రూ.కోట్లు స్వాహా.. దంపతులు అరెస్ట్
హైదరాబాద్: విద్యాసంస్థలో భాగస్వామ్యం ఇస్తామంటూ ఎన్నారైని మోసగించిన కేసులో భార్యాభర్తలను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని ఏలూరుకు చెందిన నందిగం రాణి, ధర్మరాజు దంపతులు తాము నిర్వహిస్తున్న శ్రీహర్షిత విద్యాసంస్థల్లో భాగస్వామ్యం ఇస్తామంటూ పలువురిని మోసగించినట్టు ఏపీ, తెలంగాణల్లో కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన బాధితుడి ఫిర్యాదుతో నగర సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి ఆ దంపతులను అరెస్టుచేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. హిమాయత్‌నగర్‌లోని ఐటీ కంపెనీ ఎండీ సి. హెచ్.శ్రీనివాస్ అమెరికాలోని స్నేహితుడు సుధాకర్ సూచనతో రాణి, ధర్మరాజు దంపతులను కలిశారు. గుంటూరు, ఏలూరుల్లోని తమ విద్యాసంస్థల్లో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని చెప్పడంతో శ్రీనివాస్ విడతలవారీగా రూ. 7,27,85,584 ఇచ్చి భాగస్వామిగా చేరారు.
అనంతరం లాభాల్లో వాటా ఇవ్వక పోవటంతో శ్రీనివాస్ పలుమార్లు రాణి దంపతులను ప్రశ్నించారు. తన పెట్టుబడి సొమ్ము తిరిగి ఇవ్వమని కోరినా వాయిదా వేస్తూ వచ్చారు. నిలదీస్తే చంపు తామంటూ వారు బెదిరించారు. దీంతో శ్రీనివాస్ జులై 22న నగర సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. పోలీసులు నందిగం రాణి, ఆమె భర్త ధర్మరాజు, నందిగం లక్ష్మీ హర్షిత, జి.కృష్ణారావు, జి.సురేష్, జి.రమేష్ పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. శనివారం ధర్మరాజు, రాణి దంపతులను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టుతత నిందితులకు 14 రోజులు రిమాండ్ విధించింది. నందిగం రాణిని చంచల్‌గూడ మహిళా కారాగారానికి, ధర్మరాజును చంచల్‌గూడ కేంద్ర కారాగారానికి తరలించారు. వీరు తెలుగు రాష్ట్రాలకు చెందిన 40 మంది నుంచి సుమారు రూ.35 కోట్లు వసూలు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం.