హైదరాబాద్‌లో మళ్లీ కంటైన్‌మెంట్ జోన్‌

Containment zone in Tolichowki area.క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ శ‌ర‌వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్ప‌టికే ప్ర‌పంచ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Dec 2021 2:37 PM IST
హైదరాబాద్‌లో మళ్లీ  కంటైన్‌మెంట్ జోన్‌

క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ శ‌ర‌వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా 63 కు పైగా దేశాల్లో ఈ మ‌హ‌మ్మారి వ్యాప్తి చెందింది. డెల్టా వేరియంట్ కంటే 6 రెట్ల వేగంగా ఈ మ‌హ‌మ్మారి వ్యాప్తి చెందుతుండ‌డంతో ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్తం అయ్యాయి. విదేశాల నుంచి వ‌చ్చే ప్ర‌యాణీకుల‌కు త‌ప్ప‌నిస‌రిగా ఆర్‌టీపీసీఆర్ ప‌రీక్ష‌లు చేయ‌డంతో పాటు అనుమానిత వ్య‌క్తుల నుంచి సేక‌రించిన న‌మూనాల‌ను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు కోసం పంపుతున్నారు. ఈ ప‌రీక్ష‌ల్లో క‌రోనా కొత్త వేరియంట్ వారికి సోకిందా లేదా..? అన్న‌ది తెలుస్తోంది.

ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ ఒమిక్రాన్ క‌ల‌క‌లం రేపుతోంది. హైద‌రాబాద్‌లో రెండు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు న‌మోదు కావ‌డంతో అధికారులు అప్ర‌మ‌త్తం అయ్యారు. వారు టోలీచౌకి పారామౌంట్ కాల‌నీలో ఉన్న‌ట్లు తెలుసుకున్న జీహెచ్ఎంసీ(గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌), వైద్యారోగ శాఖ అధికారులు ఆ ప్రాంతంలో క‌రోనా ఆంక్ష‌లు విధించారు. ఒమిక్రాన్ కేసులు బ‌య‌ట‌ప‌డిన వారి ఇళ్ల నుంచి స‌మీపంలోని 25 ఇళ్ల ప‌రిధిలో కంటైన్‌మెంట్ జోన్‌ను ఏర్పాటు చేశారు. ఆ కాలనీలో మరింత మంది ప్రైమరీ కాంటాక్ట్స్‌ను గుర్తించి పరీక్షలు చేయనున్నారు. బాధితులు కలిసిన, సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించే పనిలో పడ్డారు వైద్యాధికారులు. వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. బహిరంగ ప్రదేశాల్లో ఇప్పటికే మాస్క్‌ను తప్పనిసరి చేసింది. మాస్క్ లేకుండా బ‌య‌ట క‌నిపిస్తే.. భారీగా పైన్‌ను కూడా విధిస్తోంది.

Next Story