జింఖానా తొక్కిసలాట: మహిళ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ నవీనా

Constable Naveena's CPR saves woman at Gymkhana stampede. హైదరాబాద్: జింఖానా గ్రౌండ్స్‌లో గురువారం జరిగిన తొక్కిసలాటలో మహిళా పోలీసు సకాలంలో స్పందించి ఓ మహిళ

By అంజి
Published on : 22 Sept 2022 9:12 PM IST

జింఖానా తొక్కిసలాట: మహిళ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ నవీనా

హైదరాబాద్: జింఖానా గ్రౌండ్స్‌లో గురువారం జరిగిన తొక్కిసలాటలో మహిళా పోలీసు సకాలంలో స్పందించి ఓ మహిళ ప్రాణాలను కాపాడింది. బేగంపేట పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ నవీనా కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్) ఇచ్చి ఓ మహిళను కాపాడింది. భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న టీ20 మ్యాచ్ టిక్కెట్లు విక్రయిస్తున్న జింఖానా గ్రౌండ్స్‌లో జరిగిన తొక్కిసలాటలో మహిళ నేలపై కుప్ప కూలింది.

తమకు కూడా గాయాలు కావడంతో పరిస్థితిని అదుపు చేయలేకపోయామని మహిళ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ నవీనా తెలిపారు. ఎక్కువ మంది గాయపడ్డారని ఆమె తెలిపారు. ''గాయపడిన వారిని సహాయక చర్యలు అందించడం, అత్యవసర సమయంలో ఒక వ్యక్తిని రక్షించడం తమ శిక్షణ సమయంలో నేర్పించబడుతుందని, నేను అలాంటి స్థితిలో ఉన్న స్త్రీని చూసి వెంటనే సీపీఆర్ సహాయం అందించాలని అనుకున్నాను'' అని కానిస్టేబుల్‌ నవీనా తెలిపారు.

కానిస్టేబుల్ తెలిపిన వివరాల ప్రకారం.. ''మహిళ కింద పడిపోయింది, ఆమె చుట్టూ 50 మంది ఉన్నారు. నేను 2-5 నిమిషాలు సీపీఆర్‌కు ప్రయత్నించాను. కానీ ఆమె స్పందించకపోవడంతో నేను భయపడ్డాను" అని ఆమె చెప్పింది. "మేము వెంటనే సీన్ క్లియర్ చేసాము. ఆమె చనిపోయిందని మేము అనుకున్నాము కానీ అదృష్టవశాత్తూ, మేము ఆమెను రక్షించగలిగాము" అని కానిస్టేబుల్ తెలిపారు.

గేట్లు తెరిచే సమయంలో ముందు వరుసలో ఎక్కువ మంది మహిళలు ఉండడంతో మొదటగా గాయపడ్డది మహిళలేనని కానిస్టేబుల్ నవీనా తెలిపారు. తొక్కిసలాటలో పోలీసులతో సహా పలువురు గాయపడ్డారు.

మూడేళ్ల తర్వాత నగరంలో జరుగుతున్న భారత్‌-ఆస్ట్రేలియా మ్యాచ్‌కు టిక్కెట్ల కోసం క్రికెట్ అభిమానులు గురువారం ఉదయం నుంచి పెద్ద ఎత్తున క్యూలో నిల్చున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్ సెప్టెంబర్ 25న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది.


Next Story