గతంతో పోలిస్తే మానవుడి జీవన శైలి మారింది. ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమలో కూడా మార్పు వచ్చింది. ఇటీవల కాలంలో జిమ్‌లో వ్యాయామాలు చేస్తూ ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కారణాలు ఏవైనప్పటికీ వీరు గుండెపోటుతో మరణిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ యువ కానిస్టేబుల్ జిమ్ చేస్తూ కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మరణించాడు అని వైద్యులు తెలిపారు.
విశాల్ అనే 24 ఏళ్ల యువకుడు ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. ప్రతి రోజు లాగానే ఈ ఉదయం కూడా బోయిన్‌పల్లిలోని ఓ జిమ్‌కి వెళ్లాడు. కొద్ది సేపు పుష్ అప్స్ చేశాడు. లేచి నిలుచున్న తరువాత ఒక్కసారిగా ఛాతీలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. పక్కన ఉన్న వాళ్లు గమనించి అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే.. అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
కాగా.. తన కెంతో ఇష్టమైన పోలీస్ శాఖలో ఉద్యోగం రావడంతో అతడు ఎంతో ఆనందంగా ఉండేవాడని అతడి సన్నిహితులు తెలిపారు. 24 ఏళ్ల వయస్సులోనే మరణించడంతో అతడి కుటుంబం తీవ్ర విషాదంలోకి వెళ్లింది.