ములుగు ఎమ్మెల్యే సీతక్కను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల స్థానికతకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 317ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క.. పార్టీ శ్రేణులు, ఉద్యోగలతో కలిసి ట్యాంక్ బండ్ దగ్గర నిరసన దీక్షకు దిగారు. ఈ దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే సీతక్కతో పాటు ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అంతకముందు సీతక్క మీడియాతో మాట్లాడారు. అసంబద్ధ బదిలీలతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రభుత్వం నిర్ణయంతో ఇప్పటికే 9 మంది ఉపాధ్యాయులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. ఓ పక్క ఉపాధ్యాయులు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 317 జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకీ ఆమోదయోగ్యమైన బదిలీ ప్రక్రియ చేపట్టాలని సూచించారు. స్థానికత ఆధారంగా బదిలీలు చేయాలన్నారు.