హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక కోసం పోలింగ్ కేంద్రాలు, లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేయబడిన కార్యాలయాలు, సంస్థలకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి నవంబర్ 10 (పోలింగ్ ముందు రోజు), 11న (ఓటింగ్ రోజు), 14న (లెక్కింపు రోజు) తేదీలలో వేతనంతో కూడిన సెలవులను ప్రకటించారు.
ఉప ఎన్నిక సజావుగా నిర్వహించేందుకు సెలవులు ప్రకటించినట్లు కలెక్టర్ తెలిపారు. పోలింగ్ లేదా కౌంటింగ్ కోసం ఉపయోగించే ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు లేదా సంస్థలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయి. అన్ని విభాగాధిపతులు మరియు సంస్థల అధిపతులు సూచనలను ఖచ్చితంగా పాటించాలని కోరారు.
ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారుల ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తి కావొస్తున్నాయి. వివిధ పార్టీల అభ్యర్థులు సైతం తమ వ్యూహాలతో ప్రజలపై హామీ అస్త్రాలు సంధిస్తున్నారు. మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.