హైదరాబాద్‌లో వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం: సీఎం రేవంత్‌

హైదరాబాద్ నగరంలో భారీ వర్షాల కారణంగా వరదలతో ముంచెత్తుతున్న ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

By అంజి
Published on : 11 Aug 2025 7:12 AM IST

CM Revanth, permanent solution, flood problem, Hyderabad

హైదరాబాద్‌లో వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం: సీఎం రేవంత్‌

హైదరాబాద్ నగరంలో భారీ వర్షాల కారణంగా వరదలతో ముంచెత్తుతున్న ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇటీవల తక్కువ సమయంలో విపరీతమైన వర్షం కురవడం, పలుచోట్ల వరదలు ముంచెత్తుతున్న ప్రాంతాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసిన ముఖ్యమంత్రి.. అలాంటి ప్రాంతాల్లో శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

అమీర్‌పేట్, బుద్ధనగర్, మైత్రివనం, బల్కంపేట తదితర ప్రాంతాల్లో వరద ముంపుతో ప్రభావిత కాలనీలను ముఖ్యమంత్రి.. ఆదివారం ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. బుద్ధనగర్‌లో వరద నీటి డ్రెయిన్ సిస్టమ్‌ను పరిశీలించి అక్కడే అధికారులకు తగిన సూచనలు చేశారు. బల్కంపేట ముంపు ప్రభావిత ప్రాంతంలో తలెత్తుతున్న సమస్యలను హైడ్రా కమిషనర్, ఇతర అధికారులను అడిగి తెలుసుకున్నారు. బుద్ధనగర్ ప్రాంతంలో కాలనీ రోడ్డు కంటే డ్రైనేజీ కాలువ ఎక్కువ ఎత్తులో ఉండటంతో ఇరుకుగా మారి వరద తీవ్రత పెరుగుతోందని గమనించిన ముఖ్యమంత్రి వెంటనే తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఆ కాలనీకి పక్కనే గంగూబాయి బస్తీకుంటను సందర్శించి ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. బస్తీకుంటను కొంతమంది పూడ్చేసి పార్కింగ్ కోసం వినియోగిస్తున్నారని స్థానికులు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. ఆ ప్రాంతంలో ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు చేసి వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, అందుకు వెంటనే ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల పలు సందర్భాల్లో వరద నీరు నిలిచిన మైత్రీవనం వద్ద పరిస్థితిని పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అమీర్ పేట బుద్ధనగర్‌లో జశ్వంత్ అనే బాలుడితో ముఖ్యమంత్రి వివరాలు ఆరా తీశారు. బాలుడిని వెంట తీసుకుని ఆ ప్రాంతాన్ని కలియతిరిగారు. తాను 7 వ తరగతి చదువుతున్నానని, వరద నీరు ఇంట్లోకి వచ్చి పుస్తకాలు తడిసిపోయాయని ఆ బాలుడు ముఖ్యమంత్రికి వివరించారు. భవిష్యత్తులో వరద పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తానని ముఖ్యమంత్రి గారు బాలుడికి ధైర్యం చెప్పారు. ఆయా ప్రాంతాలను పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి తీసుకోవలసిన చర్యలపై హైడ్రా కమిషనర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, సంబంధిత అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.

Next Story