'కఠిన నిబంధనలు తీసుకొస్తాం'.. హైదరాబాద్‌లో పొల్యూషన్‌పై సీఎం రేవంత్‌ వ్యాఖ్యలు

హైదరాబాద్‌ను కాలుష్య రహిత మహానగరంగా తీర్చిదిద్దడంలో అవసరమైన నియమ నిబంధనలు, విధి విధానాలు తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పారు.

By అంజి  Published on  6 Dec 2024 1:38 AM GMT
CM Revanth, pollution ,Hyderabad, GHMC

'కఠిన నిబంధనలు తీసుకొస్తాం'.. హైదరాబాద్‌లో పొల్యూషన్‌పై సీఎం రేవంత్‌ వ్యాఖ్యలు

హైదరాబాద్‌ను కాలుష్య రహిత మహానగరంగా తీర్చిదిద్దడంలో అవసరమైన నియమ నిబంధనలు, విధి విధానాలు తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పారు. కొన్నిసార్లు నియమ నిబంధనలు కఠిన తరమైనప్పటికీ వాటిని అమలు చేస్తామని, అందుకు అధికారులకు పూర్తి స్వేచ్ఛను ఇస్తామని అన్నారు. “ఈ నగరం మనది. ఈ నగరంలో మనమే ఉన్నాం. మనమే కాదు మన భవిష్యత్తు తరాలు ఇక్కడ నివసించాలి. ఈ నగరం అద్భుతంగా రాణించాలి. ఈ నగరం కాలుష్య రహిత విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న ప్రజా ప్రభుత్వ సంకల్పానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి” అని కోరారు.

ప్రజా పాలన - ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో భాగంగా రవాణా శాఖ సాధించిన విజయాలపై నిర్వహించిన సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా “రోడ్డు భద్రత – మా ప్రధాన్యత” పేరుతో రవాణా శాఖ రూపొందించిన లోగో టీజీటీడీను సీఎం ఆవిష్కరించారు. దానికి ముందు రవాణా శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. రవాణా శాఖ, ఆర్టీసీ సాధించిన విజయాలపై రూపొందించిన బ్రోచర్‌ను విడుదల చేశారు. వాహనాల స్క్రాపింగ్ పాలసీ ధ్రువీకరణ పత్రాలను అందించారు. తెలంగాణ ఆర్టీసీలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు 557 మందికి కారుణ్య నియామక పత్రాలను అందించారు.

అనంతరం కార్యక్రమంలో మాట్లాడుతూ.. ''కాలుష్యాన్ని నియంత్రించడానికి చట్టాలను పకడ్బందీగా అమలు చేస్తూ రవాణా శాఖ, ఆర్టీసీ సిబ్బంది క్రియా శీలకంగా పనిచేయాలి. అందుకే స్క్రాప్ పాలసీని తెచ్చాం. కాలం చెల్లిన వాహనాలను స్క్రాప్‌కు పంపించాలి. నగరంలో డీజిల్, పెట్రోల్ వాహనాలు విపరీతమైన కాలుష్యం వెదజల్లుతున్నాయి. కాలుష్యంపై ప్రజలకు అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది. పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొనే కాలుష్య రహిత ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్ టాక్స్ నుంచి వంద శాతం మినహాయింపును ఇచ్చాం'' అని సీఎం అన్నారు.

''ఓఆర్ఆర్ లోపు ఉన్న హైదరాబాద్ కోర్ అర్బన్ రీజన్ లో 3 వేల బస్సులు డీజిల్‌తో నడుస్తున్నాయి. రాబోయే 2 ఏండ్లలో అన్నింటినీ బయటకు పంపి 3 వేల ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసి నడిపిస్తాం. కాలుష్యం వెదజల్లుతున్న ఆటోలు, క్యాబ్‌లను ఓఆర్ఆర్ అవతలకి పంపించాలి. ప్రత్యామ్నాయంగా వాటి స్థానంలో వారంతా కాలుష్యరహిత వాహనాలు కొనుగోలు చేసేలా ప్రోత్సహించడానికి ఎలాంటి పథకాలు, ప్రణాళికలు అమలు చేయాలి. వారిని ఏ విధంగా ఆదుకోవాలన్న విషయాలపై రవాణా శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేయాలి'' అని సీఎం సూచించారు.

''ఢిల్లీలో వాయు, శబ్ద కాలుష్యంతో ఎంతటి దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటుందో అందరూ గమనిస్తున్నారు. అలాంటి పరిస్థితులే ముంబయ్, చెన్నై, కోల్ కతా, బెంగుళూరు నగరాలు కాలుష్యాలతో తల్లడిల్లుతున్న పరిస్థితులు మన కళ్లముందే కనబడుతున్నాయి. కాలుష్య రహితంగా నగరంగా తీర్చిదిద్దడంలో మూసీ నది పునరుజ్జీవం చేయాల్సిన అవసరం ఉంది. గోదావరి నదితో అనుసంధానం చేసి మూసీలో మంచినీరు ప్రవహించే విధంగా చేయడం ద్వారా మూసీలోని మురికిని కడగొచ్చు. ఆ సంకల్పంలో అందరి ఆశీర్వాదాలు కావాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 9 నుంచి మహిళలకు అమలు చేస్తున్న ఉచిత బస్సు సౌకర్యం వల్ల 115.76 కోట్ల ఉచిత ప్రయాణాలు (జీరో టికెట్) చేయగా 3902.31 కోట్ల రూపాయలు మహిళలకు ఆదా అయింది. గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ, సంస్థ సిబ్బంది విషయంలో పూర్తి నిర్లక్ష్యానికి గురైంది. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు వెళతాం'' అని సీఎం వివరించారు.

Next Story