హైదరాబాద్‌ను పవర్ ఐలాండ్‌గా మార్చాం : సీఎం కేసీఆర్
CM KCR speech in Hyderabad Airport Metro Inauguration.హైదరాబాద్ నగరాన్ని పవర్ ఐలాండ్ గా మార్చినట్లు కేసీఆర్
By తోట వంశీ కుమార్ Published on 9 Dec 2022 8:00 AMహైదరాబాద్ నగరాన్ని పవర్ ఐలాండ్ గా మార్చినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. న్యూయార్క్, లండన్, పారిస్ వంటి నగరాల్లో కరెంట్ పోవచ్చునేమోగానీ నగరంలో మాత్రం ఒక్క క్షణం కూడా పోదని చెప్పారు. మైండ్ స్పేస్ వద్ద ఎయిర్‌పోర్టు మెట్రోకు శంకుస్థాపన చేసిన అనంతరం రాజేంద్రనగర్ అప్పా జంక్షన్ దగ్గర గల పోలీస్ అకాడమీలో ఏర్పాటు చేసిన బహిరంగలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
వైశాల్యం, జనాభాలో దేశ రాజధాని ఢిల్లీ కంటే హైదరాబాద్ పెద్దది. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. 1912లోనే హైదరాబాద్‌కు విద్యుత్ వచ్చింది. చైన్నైకు 1927లో వచ్చింది. చరిత్రలో నిజమైన కాస్మోపాలిటన్ సిటీగా అన్ని వర్గాలను, కులాలను, మతాలను, ప్రాంతాలను, జాతులను అందర్నీ అక్కున చేర్చుకోని అద్భుతమైనటువంటి విశ్వనగరంగా ఉన్న హైదరాబాద్ ఈ రోజు ఎయిర్‌పోర్టు కనెక్టివిటీ కోసం మెట్రోకు శంకుస్థాపనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
గతంలో సమైక్య పాలకుల నిర్లక్ష్యం వల్ల హైదరాబాద్‌లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదు. నగరంలో ఏ మూలకు వెళ్లినా మంచినీటి సమస్య ఉండేది. గతంలో కరెంటు కోసం ధర్నాలు జరిగాయి. అయితే.. ఇప్పుడు క్షణం కూడా కరెంట్ పోకుండా పవర్ ఐలాండ్ మార్చాం. లండన్, న్యూయార్క్‌లో కరెంట్ పోవచ్చు కానీ హైదరాబాద్‌లో పోదని సీఎం కేసీఆర్ అన్నారు.
హైదరాబాద్ మెట్రోలో నిత్యం నాలుగున్నర లక్షల మంది ప్రయాణిస్తున్నారని చెప్పారు. కాలుష్య రహితంగా మర్చడానికి మెట్రో చాలా అవసరం. ఇక ఐటీ రంగంలో సుమారు 500 గొప్ప పరిశ్రమలు హైదరాబాద్‌లో కొలువుదీరుతున్నాయని చెప్పారు.