హైదరాబాద్: హెచ్‌సీఏ అవకతవకల కేసు వ్యవహారంలో సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో రిమాండ్‌లో ఉన్న ఐదుగురిని కస్టడీలోకి ఇవ్వాలని మల్కాజ్‌గిరి కోర్టులో పిటిషన్ వేసింది. వారిని 10 రోజుల పాటు విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. హెచ్‌సీఏలో అక్రమాలు జరిగాయని, కమిటీ అధ్యక్షుడు జగన్మోహనే కీలక సూత్రధారి అని, బీసీసీఐతో పాటు ఐపీఎల్ నుంచి వచ్చిన నిధులను దుర్వినియోగం చేశారని సీఐడీ పేర్కొంది. ఆర్థిక లావాదేవీలు కేటాయింపులు, క్లబ్బులకు నిధుల జారీ పైన జగన్మోహన్ తో పాటు నిందితులను విచారించాల్సి ఉందని సీఐడీ పేర్కొంది.
అటు హెచ్‌సీఏ అవకతవకల వ్యవహారంలో ఈడీ రంగంలోకి దిగింది. హెచ్‌సీఏ కేసు వివరాలు ఇవ్వాలని సీఐడీకి లేఖ రాసింది. ఎఫ్‌ఐఆర్, రిమాండ్ రిపోర్టులు, వాంగ్మూలాలు ఇవ్వాలని కోరింది. సీఐడీ నుంచి వివరాలు రాగానే కేసు నమోదు చేయాలనే ఆలోచనలో ఈడీ ఉన్నట్టు తెలుస్తోంది. కాగా హెచ్‌సీఏలో నిధుల గల్లంతు, నకిలీ పత్రాలతో జగన్మోహన్ ఎన్నిక, ప్లేయర్ల ఎంపికలో అవకతవకలు వంటి అభియోగాలపై సీఐడీ దర్యాప్తు చేస్తోంది.