ఆ తల్లికి ఏం కష్టమొచ్చిందో.. ఏ కామాంధుడి కర్కశత్వానికి బలైపోయిందో.. లేక పుట్టిన బిడ్డ భారంగా భావించారో.. లేక దురదృష్టవశాత్తూ ఆ పుట్టిన బిడ్డ వెంటనే కన్నుమూసిందో తెలీదు గానీ ఓ అట్టపెట్టెలో పెట్టేసి నిర్దాక్షిణ్యంగా రోడ్డుపక్కన పడేశారు. సాధారణంగా చికిత్స పొందుతూ గానీ, డెలివరీ సమయంలో గానీ బిడ్డ చనిపోతే ఆ మృత శిశువును ఎక్కడో ఓ చోట పూడ్చి పెడతారు. కానీ మానవత్వం లేకుండా అట్టపెట్టెలో ప్యాక్‌ చేసి మరీ విసిరేశారు. ఈ అమానుష ఘ‌ట‌న హైదరాబాద్ న‌గ‌రంలో చోటు చేసుకుంది.

బాలాపూర్‌ డీఆర్‌డీఎల్‌ శివాజీ చౌక్‌ వద్ద అట్టపెట్టెలో ఓ శిశువు మృత‌దేహాం పడి ఉండ‌డాన్ని అటుగా వెలుతున్న స్థానికులు గ‌మ‌నించారు. వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించారు. పోలీసులు అక్క‌డ‌కు చేరుకుని ప‌రిశీలించ‌గా.. అప్పుడే పుట్టిన పసికందు మృతదేహం వస్త్రంలో చుట్టి ఉంది. శిశువు మృతిచెందడంతో ఇక్క‌డ ప‌డ‌వేశారా..? లేదా ఇక్క‌డ ప‌డ‌వేయ‌డంతోనే శిశువు మృతి చెందాడా అన్న దానిపైన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అస‌లు ఆ శిశువును అక్క‌డ ఎందుకు ప‌డ‌వేశారు..? ఎవ‌రు ప‌డ‌వేశారు..? అన్న సంగ‌తి తెలుసుకునే ప‌నిలో ఉన్నారు పోలీసులు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల‌ను ప‌రిశీలిస్తున్నారు.


తోట‌ వంశీ కుమార్‌

Next Story