హైదరాబాద్ శివార్లలో చిరుతపులి సంచారం.. ప్రజల్లో భయం.. భయం
హైదరాబాద్ నగర శివార్లలోని శంషాబాద్‌లో కనిపించిన చిరుతను పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
By అంజి Published on 25 Jun 2024 4:45 PM ISTహైదరాబాద్ శివార్లలో చిరుతపులి సంచారం.. ప్రజల్లో భయం.. భయం
హైదరాబాద్ నగర శివార్లలోని శంషాబాద్‌లో కనిపించిన చిరుతను పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం తెల్లవారుజామున సీసీటీవీలో చిరుత పులి దృశ్యాలు రికార్డు కావడంతో అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. చిరుత పులిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు 10 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి మూడు బోనులను ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ఝాన్సీమియాగూడలోని ఓ నివాసంలో చిరుతపులి సంచరిస్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.
శంషాబాద్ సమీపంలో చిరుత సంచారం భయాందోళనలు సృష్టిస్తోంది. ఈ ప్రాంతంలో చిరుత పులి ఉన్నట్లు స్థానికులు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. వీధికుక్కలు, పశువులపై చిరుతపులి దాడి చేసినట్లు వారు తెలిపారు. అయితే అది చిరుతపులి అని అటవీశాఖ అధికారులు నిర్ధారించలేదు. హైదరాబాద్ శివార్లలో చిరుతపులి ఉండటంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే వి.ప్రకాష్ గౌడ్ ఈ ప్రాంతాన్ని సందర్శించి చిరుతను పట్టుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులను కోరారు.
గత నెలలో ఇదే ప్రాంతంలోని హైదరాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో చిరుతపులి పట్టుబడింది. ఐదు రోజుల పాటు సాగిన ఆపరేషన్ తర్వాత, లోపల కట్టి ఉన్న లైవ్ ఎర వద్దకు చేరుకున్న చిరుత పులిని బోనులో బంధించారు అటవీ అధికారులు. మూడేళ్ల మగ చిరుతపులిని నెహ్రూ జూలాజికల్ పార్కుకు తరలించి, ఆ తర్వాత అడవుల్లో విడిచిపెట్టారు.