చింతపండు నవీన్ కుమార్ అంటే పెద్దగా ఎవరూ గుర్తుపట్టకపోవచ్చు గానీ.. తీన్మార్ మల్లన్న అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. క్యూ టీవీని నిర్వహిస్తున్న తీన్మార్ మల్లన్నపై చిలకలగూడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సీతాఫల్‌మండి డివిజన్ మధురానగర్‌కాలనీలో.. మారుతి సేవా సమితి పేరిట లక్ష్మీకాంతశర్మ జ్యోతిషాలయం నిర్వహిస్తున్నాడు. లక్ష్మీకాంత శర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలకలగూడ పోలీసులు తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు చేశారు.
ఈ నెల 19న తీన్మార్ మల్లన్న తనకు ఫోన్ చేసి బెదిరించాడని.. రూ.30లక్షలు ఇవ్వకపోతే తనపై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తాడని చెప్పాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాను డబ్బులు ఇవ్వనని చెప్పడంతో.. ఈ నెల 20న తనపై తప్పుడు కథనాలు ప్రచురించి తన పరువుకు భంగం కలిగేలా చేశాడని.. ఈ నెల 22న పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు లక్ష్మీకాంత శర్మ. దీంతో తీన్మార్ మల్లన్న పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చిలకలగూడ సీఐ నరేష్ తెలిపారు.