కరోనా మహమ్మారితో కలిసి జీవించాలని ఇప్పటికే ప్రభుత్వాలు చెబుతున్న సంగతి తెలిసిందే. ఇక తెలంగాణలో సగానిపైగా వ్యాక్సినేషన్ ను వేయించుకున్నారు. ఇప్పుడిప్పుడే కరోనా పూర్వపు స్థితికి కార్యకలాపాలు చేరుకుంటున్నాయి. పాఠశాలలు, కళాశాలలు, ఉపాధి రంగాలు పూర్తిగా తెరచుకున్నాయి. ఈ నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. భాగ్యనగర వాసులకు శుభవార్త చెప్పింది. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే ఆర్టీసీ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.
సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లలతో పాటు ఎంజీబీఎస్, జేబీఎస్ లలో కూడా ఉదయం నాలుగు గంటల నుంచే సిటీ బస్సులు బయలుదేరుతాయని గ్రేటర్ జోన్ ఈడీ వెంకటేశ్వరు తెలిపారు. అంతేకాకుండా హయత్‌నగర్, ఫలక్‌నుమా, హెచ్‌సీయూ, మియాపూర్, బీహెచ్ఈఎల్, ఈసీఐఎల్, ఉప్పల్, జీడిమెట్ల, చెంగిచర్ల, మిధాని, మెహిదీపట్నం డిపోల నుంచి కూడా నాలుగు గంటలకే బస్సు సర్వీసులు అందుబాటులో ఉండనున్నట్లు చెప్పారు. విద్యాసంస్థలు పూర్తిస్థాయిలో తెరుచుకోవడంతో విద్యార్థులకు కోసం కోఠీ- హయత్‌నగర్ మధ్య అదనంగా మరో 12 సర్వీసులను నడపనున్నట్లు వెల్లడించారు. నేటి నుంచి ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. భాగ్యనగరంలో బస్సులు ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి 10 వరకూ షెడ్యూల్ చేసినట్లు తెలిపారు.