ప్రయాణీకులకు షాక్.. పెరగనున్న బస్ పాసుల చార్జీలు..!
Bus Pass fares increased from April 1st.మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు అన్నచందంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు
By తోట వంశీ కుమార్ Published on 25 March 2022 8:56 AM ISTమూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు అన్నచందంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) పరిస్థితి తయారైంది. అసలే నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీకి పెరుగుతున్న డీజిల్ ధరలు మరింత భారంగా తయారైయ్యాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అన్ని రకాల బస్ పాస్ చార్జీలను పెంచాలని నిర్ణయం తీసుకుంది. వివిధ రకాల నెలవారీ బస్ పాసులపై రూ.200 నుంచి రూ.500 వరకు పెరగనున్నాయి. జనరల్ బస్ టికెట్ పాసుల కేటగిరిలో ఆర్డినరీ పాస్ చార్జీ రూ.950 నుంచి రూ.1150కి, మెట్రో ఎక్స్‌ప్రెస్ రూ.1,070 నుంచి రూ.1,300కు, మెట్రో డీలక్స్ రూ.1,185 నుంచి రూ.1,450కి, మెట్రో లగ్జరీ రూ.2 వేల నుంచి రూ.2,400కు, పుష్పక్ పాస్ రూ.2,500 నుంచి రూ.3 వేలకు పెరిగాయి.
ఎన్‌జీఓ బస్‌పాస్‌లకు సంబంధించి.. ఆర్డినరీ పాస్ చార్జీ రూ.320 నుంచి రూ.400కు, మెట్రో ఎక్స్‌ప్రెస్ రూ.450 నుంచి రూ.550కి, మెట్రో డీలక్స్ రూ.575 నుంచి రూ.700కు, ఎంఎంటీఎస్–ఆర్టీసీ కోంబో టికెట్ చార్జీ రూ.1,090 నుంచి రూ.1,350కి పెరిగింది. కాగా.. పెరిగిన బస్ పాస్ చార్జీలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.
ఇదిలా ఉంటే.. ఇటీవలే సేఫ్టీ సెస్ పేరుతో టీకెట్‌పై రూపాయి పెంచగా.. చిల్లర సమస్య రాకుండా ఉండేందుకు టికెట్ ధరను రౌండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక అసలైన టికెట్ పెంపు కోసం ఆర్టీసీ ప్రతిపాదనలను సీఎం వద్దకు పంపింది. సీఎం కేసీఆర్ పెంపుకు అనుమతి ఇస్తే ఆ చార్జీలు కూడా పెరగనున్నాయి.