హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ ఉప్పర్‌గూడా నుండి శబరిమలకు వెళ్తున్న అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా పడింది. శ్రీరామ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు గురువారం రాత్రి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పంపాడి తాలూకా ఆసుపత్రిలో ఉంచారు. కేరళ రాష్ట్రంలోని కొట్టాయం జిల్లా కనమల అట్టివలం వద్ద ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
ఘాట్ రోడ్డు మలుపులో అదుపు తప్పి బోల్తా పడ్డ బస్సు.. మూడు చెట్లపై ఒరగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో 8 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం కొట్టాయం మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. పలువురు అయ్యప్ప స్వాములు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బస్సు ప్రమాదానికి గురికావడంతో ఆ దారిలో రాకపోకలు నిలిచిపోయాయి. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. భారీ క్రేన్ సాయంతో ప్రమాదానికి గురైన బస్సును అక్కడి నుంచి తొలగించారు.