Hyderabad: మహిళా వీసీని బెదిరించిన బీఆర్‌ఎస్ నేత
తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం వీసీని బెదిరించిన బీఆర్‌ఎస్ నాయకుడిని సుల్తాన్ బజార్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు.
By అంజి Published on 7 July 2023 6:58 AM ISTHyderabad: మహిళా వీసీని బెదిరించిన బీఆర్‌ఎస్ నేత
హైదరాబాద్: తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ (ఇన్‌చార్జి)ని బెదిరించి విధులు నిర్వహించకుండా అడ్డుకున్నందుకు గాను బీఆర్‌ఎస్ నాయకుడిని సుల్తాన్ బజార్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వీసీ ఎం విజ్జులత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్ జూలై 1వ తేదీ మధ్యాహ్నం 12:45 గంటలకు వీసీ కార్యాలయంలోకి ప్రవేశించాడు.
విద్యార్థినులకు ఉచిత విద్య, ఉపకార వేతనాలు అందజేస్తూ ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్న తనను ఘనంగా సత్కరించాలని వీసీని అభ్యర్థించారు. నిందితుడు గోషామహల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీ పడుతున్నాడు.
బీఆర్‌ఎస్ నేత అభ్యర్థనను వీసీ అంగీకరించారు. అయితే, మహిళా విశ్వవిద్యాలయం అభివృద్ధికి ఆర్థికంగా సహకరించాలని వీసీ ఆయనను కోరారు. తెలంగాణ మహిళా విశ్వ విద్యాలయంలో ఆర్థికంగా, సామాజికంగా బలహీనంగా ఉన్న కొంతమంది విద్యార్థులకు చేయూత అందించాలని కోరారు. ఇది తమ విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుందని, వారు సత్కరించడానికి సిద్ధంగా ఉంటారని ఆమె అతనికి చెప్పారు. అయితే వీసీ యొక్క డిమాండ్ బీఆర్‌ఎస్ నాయకుడిని చికాకు పెట్టించింది.
అతను కోపంతో స్వరం పెంచి వీసీ బెదిరించడం మొదలుపెట్టాడు. నువ్వేమైనా ఐపీఎస్, ఐఏఎస్ అధికారిని అనుకుంటున్నావా? వీసీవి అయ్యాక కళ్లు నెత్తికెక్కాయి.. అని దూషించాడు. తదనంతరం, ఆమె అధికారిక విధుల్లో బిజీగా ఉన్నందున కార్యాలయం నుండి బయటకు వెళ్లాలని వీసీ కోరినప్పటికీ, అతను వినలేదు. వీసీ ఫిర్యాదు మేరకు పోలీసులు గడ్డం శ్రీనివాస్ యాదవ్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.