హైదరాబాద్ నగరంలో విషాదం చోటు చేసుకుంది. బాలుడిని గాలిపటం బలిగొంది. విద్యుత్ తీగలో చిక్కుకుపోయిన గాలిపటాన్ని కర్రతో తీసే ప్రయత్నంలో గురువారం విద్యుదాఘాతానికి గురైన 10 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. చనిపోయిన బాలుడిని నేరేడ్‌మెట్‌లోని బలరామ్ నగర్‌లో నివాసముంటున్న ఎస్‌కే అయాన్ గా పోలీసులు గుర్తించారు. కిందపడ్డ బాలుడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే బాలుడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న నేరేడ్‌మెట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కలకత్తాకు చెందిన హసీదుల్‌హక్.. ఉపాధి నిమిత్తం నగరానికి వలస వచ్చాడు. మల్కాజిగిరి పరిధిలోని బలరాంనగర్‌లో నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య, 10 ఏళ్ల కుమారుడు ఎస్‌కే అయాన్ ఉన్నారు. అయాన్ ఓ అపార్టుమెంట్ పైకి ఎక్కి గాలిపటాన్ని ఎగురవేస్తున్నాడు. అయితే, బిల్డింగ్‌కు అతిదగ్గర్లో ఉన్న విద్యుత్ హైటెన్షన్ వైర్లకు గాలిపటం దారం చుట్టుకుంది. దీంతో బలంగా గాలిపటాన్ని లాగే ప్రయత్నంలో విద్యుత్‌వైర్లు బాలునికి తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. స్థానికులు బాలుడిని వెంటనే మిలట్రీ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే బాలుడు మరణించినట్లు ధ్రువీకరించారు.