బాంబు బెదిరింపు కాల్ చేసిన హైద‌రాబాద్ వ్య‌క్తికి 18 రోజుల జైలు శిక్ష‌

Bomb threat How a man gets 18 days jail term for hoax call in Hyderabad.హైదరాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు మంగళవారం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Nov 2022 9:36 AM GMT
బాంబు బెదిరింపు కాల్ చేసిన హైద‌రాబాద్ వ్య‌క్తికి 18 రోజుల జైలు శిక్ష‌

హైదరాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు మంగళవారం రాత్రి 9:15 గంటల స‌మ‌యంలో సంతోన‌గ‌ర్‌లో బాంబు పెట్టినట్లు కాల్ రావడంతో నగరంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.

కాల్‌ అందుకున్న వెంటనే బాంబు స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌ లు రంగంలోకి దిగాయని ఎస్‌హెచ్‌వో సైదాబాద్‌ కె సుబ్బిరామి రెడ్డి న్యూస్‌మీటర్‌కు తెలిపారు. "ఆ ప్రాంతం మొత్తం జ‌ల్లెడ ప‌ట్టాము. అయితే.. అక్క‌డ అనుమానాస్ప‌ద వ‌స్తువులు, బాంబుకు సంబంధించిన ప‌దార్ధాలు ఏమీ కూడా దొర‌క‌లేద‌ని" చెప్పారు.

కాల్‌ను ట్రేస్ చేయగా.. సంతోష్ నగర్‌లో నివాసం ఉంటున్న ఎండీ అక్బర్ ఖాన్ తన భార్యతో గొడవల నేపథ్యంలో బూటకపు కాల్ చేశాడ‌ని పోలీసులు గుర్తించారు. "అక్భ‌ర్ వేధింపులు భ‌రించ‌లేక‌, అత‌డి భార్య అత‌డిని వ‌దిలి చౌటుప్ప‌ల్‌కు వెళ్లింది. దీంతో అక్భ‌ర్ గొడ‌వ సృష్టించాల‌నుకున్నాడు. బాంబు బెదిరింపు బూట‌క‌పు కాల్ చేశాడు. "అని రెడ్డి చెప్పారు.

ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు 182, 186, 70(బి) సిటీ పోలీస్ యాక్ట్ కింద సైదాబాద్ పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదు చేశారు. కోర్టులో హాజ‌రుప‌ర‌చ‌గా నిందితుడికి 18 రోజుల జైలు శిక్ష పడింది.

ఇదిలా ఉంటే.. ఈ ఏడాది మే నెల‌లో 22 ఏళ్ల జ‌నిగ‌ల మ‌ధు అనే యువ‌కుడు డ‌య‌ల్ 100కు కాల్ చేసి త‌న‌కు రెండు బీర్ బాటిళ్లు ఏర్పాటు చేయాల‌ని పోలీసుల‌ను కోరాడు. పోలీసులు ప్ర‌జ‌ల‌కు సాయం చేయాల‌ని, అందుక‌నే త‌న‌కోసం మ‌ద్యం ఏర్పాటు చేయాల‌ని వాదించాడు. అతనిపై కేసు నమోదు చేశామని, అలాంటి చర్యలకు పాల్పడవద్దని కౌన్సెలింగ్ చేసినట్లు ఎస్‌ఐ దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ వి రమేష్ కుమార్ తెలిపారు.

"డ‌య‌ల్ 100 అనేది అత్య‌వ‌స‌ర హెల్ప్‌లైన్ నెంబ‌ర్‌. దీనిని దుర్వినియోగం చేయ‌వ‌ద్దు. ఏదైన అత్య‌వ‌స‌ర సాయం కోసం మాత్ర‌మే కాల్ చేయాల‌ని ప్ర‌జ‌ల‌ను మేము అభ్య‌ర్థిస్తున్నాం." అని ఆయ‌న అన్నారు.

మరో సంఘటనలో.. న‌ల్లొండ జిల్లా క‌న‌గ‌ల్ మండ‌లం చెర్ల గౌరారం గ్రామానికి చెందిన న‌వీన్ అనే వ్య‌క్తి హోలీ పండుగ రోజు త‌న భార్య మ‌ట‌న్ వండ‌డానికి నిరాక‌రించింద‌ని పోలీసుల‌కు ఫోన్ చేశాడు. పోలీసులు స‌ర్ది చెప్పినా వినలేదు. ఏకంగా ఆరు సార్లు డ‌య‌ల్ 100కి కాల్ చేశాడు. ప‌దే ప‌దే పోలీసుల‌కు కాల్ చేసి విసిగించినందుకు అత‌డిని అరెస్ట్ చేశారు.

Next Story