Hyderabad: రక్తదానం చేస్తానంటూ మోసాలు, యువకుడు అరెస్ట్

జల్సాలకు అలవాటు పడి సరికొత్త విధానం ఎంచుకున్నాడు ఓ యువకుడు. రక్తదానం పేరుతో మోసాలకు పాల్పడటం మొదలుపెట్టాడు.

By Srikanth Gundamalla  Published on  17 Sep 2023 7:50 AM GMT
Blood Donation, Scam, Man Arrest, Hyderabad, Crime,

Hyderabad: రక్తదానం చేస్తానంటూ మోసాలు, యువకుడు అరెస్ట్

డబ్బుల కోసం కొందరు కేటుగాళ్లు అనేక రకాల మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకమైన జనాలను టార్గెట్‌గా చేసుకుని దోపిడీలు చేస్తున్నారు. క్రికెట్‌ బెట్టింగ్‌, జల్సాలకు అలవాటు పడి సరికొత్త విధానం ఎంచుకున్నాడు ఓ యువకుడు. రక్తదానం పేరుతో మోసాలకు పాల్పడటం మొదలుపెట్టాడు. హైదరాబాద్‌ నగరంలో వెలుగు చూసిన ఈ తరహా మోసాన్ని చూసి అధికారులు కూడా షాక్‌ అయ్యారు. రక్తదానం పేరుతో అమాయకమైన జనాలను మోసం చేసి వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు. వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడు. అయితే.. హైదరాబాద్‌ సీసీఎస్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన సందీప్ అనే యువకుడు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అయితే.. ఇతను కరోనా సమయంలో ఉద్యోగం కోల్పోయాడు. ఆతర్వాత క్రికెట్‌ బెట్టింగ్‌, జల్సాలకు అలవాటు పడ్డాడు. సులభంగా డబ్బులు సంపాదించాలని అనుకున్నాడు. సోషల్‌ మీడియాలో అర్జెంట్‌గా రక్తం, ప్లాస్మా కావాలని పోస్టులు రాగానే అందులో ఉన్న పేషెంట్‌ కాంటాక్ట్‌ నెంబర్‌కు కాల్‌ చేస్తున్నాడు. అవసరమైన బ్లడ్ తాను ఇస్తానని మాయమాటలు చెప్పి నమ్మించేవాడు. అంతేకాదు.. ఖర్చుల కోసం బాధితుల వద్ద నుంచి వేల రూపాయలు ఆన్‌లైన్‌ద్వారా ట్రాన్స్‌ఫర్ చేయించుకునేవాడు. ఇదిగో వస్తున్నా.. అదిగో వస్తున్నా.. దారిలో ఉన్నా అంటు కల్లబొల్లి కబుర్లు చెప్తూ డబ్బులు కొంత మొత్తంలో అందాక ఫోన్ స్విచ్ఛాఫ్ చేసేవాడు.

మోసపోతున్నామనే విషయం తెలియక రోగి బంధువులు.. అతడు అడిగినన్ని డబ్బు పంపించేవారు. ఇటీవల దోమలగూడ పరిధిలోని ఓ బాధిత కుటుంబం ఇదే విధంగా మోసపోయారు. అయితే.. వారు సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో.. రంగంలోకి దిగిన పోలీసులు నెంబర్‌ ఆధారంగా దర్యాప్తు చేశారు. చివరకు నిందితుడిని పట్టుకున్నారు. కాగా.. నిందితుడు సందీప్‌ గతంలోనూ మోసాలకు పాల్పడి 11 నెలలపాటు జైలు శిక్ష అనుభవించాడని హైదరాబాద్‌ సీసీఎస్‌ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. బ్లడ్‌ డొనేషన్‌ చేస్తామంటూ డబ్బులు అడిగేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని.. బ్లడ్‌ డొనేషన్‌ సోషల్‌ మీడియా గ్రూపుల్లో ఇలాంటి వారిపట్ల జాగ్రత్తలు వహించాలని డీసీపీ శిల్పవల్లి సూచించారు.

Next Story