హైదరాబాద్ నగర శివార్లలో అమానుష ఘటన చోటు చేసుకుంది. 16 ఏళ్ల బాలుడి మర్మాంగాలపై టపాసులు కాల్చారు. ఈ ఘటనను మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగుచూసింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఖుషీనగర్ కు చెందిన 16 ఏళ్ల బాలుడు ఉపాధి నిమిత్తం మూడు నెలల క్రితం హైదరాబాద్‌కు వచ్చాడు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి బాసీరేగడి శివారులోని ఓ టపాసుల కర్మాగారంలో పని చేస్తున్నాడు. తోటి యువకులు కొన్ని రోజులుగా ఆ బాలుడిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
ఈక్రమంలో ఓరోజు అత్యంత పైశాచికంగా ప్రవర్తించారు. బాలుడిని కదలకుండా గట్టిగా పట్టుకుని అతడి మర్మాంగాలపై టపాసులు పేలుస్తూ.. ఆ తతంగాన్నీ వీడియో తీశారు. బాలుడు ఎంత బతిమాలినా వినలేదు. పైగా అతడి ఫోన్‌ను లాక్కుకున్నారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. ఈ వీడియోను బాలుడి బంధువులు చూసి కుటుంబ సభ్యులకు చెప్పారు.
ఆ తరువాత బాలుడి తల్లిదండ్రులు అతడికి ఫోన్ చేసి ఘటన గురించి ఆరా తీశారు. వారు ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం ఆ కేసును మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌కు బదిలి చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.