హైదరాబాద్ విమోచన దినోత్సవం: బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

BJP Mahila Morcha take out bike rally ahead of Hyderabad Liberation Day. సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో గురువారం

By అంజి  Published on  15 Sep 2022 1:57 PM GMT
హైదరాబాద్ విమోచన దినోత్సవం: బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో గురువారం చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి ఆలయం నుంచి పరేడ్‌ గ్రౌండ్స్‌ మీదుగా సర్దార్‌ వల్లబాయి పటేల్‌ వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతాకృష్ణమూర్తితోపాటు కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.

75వ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గతంలోనే ప్రకటించారు. ఆ రోజును జాతీయ సమైక్యతా దినోత్సవంగా పాటిస్తామని టీఆర్‌ఎస్‌ కూడా స్పష్టం చేసింది. ఈ వేడుకల్లో రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. సెప్టెంబరు 18న భారీ ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు.

మరోవైపు బీజేపీ ఏడాది పాటు సంబరాలు జరుపుకుంటుందని ప్రకటించింది. సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వేడుకలను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రులను హైదరాబాద్‌కు ఆహ్వానించారు.

భారత యూనియన్‌లో హైదరాబాద్‌ విలీనానికి గుర్తుగా ఏడాదిపాటు వేడుకలు నిర్వహించాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. ఆపరేషన్ పోలో అని పిలువబడే భారత సాయుధ దళాల సైనిక చర్య ద్వారా హైదరాబాద్‌ను 17 సెప్టెంబర్ 1948న భారత్‌లో కలిపారు.

శుక్రవారం ప్రార్థనల అనంతరం సెప్టెంబరు 16న బైక్‌ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ తెలిపారు. దీనికి 'తిరంగా ర్యాలీ' అని పేరు పెట్టిన ఒవైసీ, మధ్యాహ్నం 1.30 గంటలకు తాడ్‌బన్‌లోని మీర్ ఆలం ఈద్గా నుండి ర్యాలీ ప్రారంభమవుతుందని చెప్పారు. తీగలకుంట చౌరస్తాలో బహిరంగ సభ, జెండాను ఆవిష్కరిస్తారు. హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని జాతీయ సమైక్యతా దినోత్సవంగా పిలవాలని కోరుతూ ఏఐఎంఐఎం అధినేత గతంలో కేంద్రానికి లేఖ రాశారు.

Next Story
Share it